కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం (Prakasham Bus Fire) జిల్లా వలేటివారిపాలెం మండలం చుండి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. అయితే, బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో లోపల ఉన్న 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. కడప నుండి విజయవాడ మార్గంలో వెళ్తుండగా చుండి వద్దకు చేరుకోగానే బస్సు రన్నింగ్‌లోనే ఒక్కసారిగా టైరు పేలిపోయింది. దీని ప్రభావంతో క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు నలుమూలలా వేగంగా వ్యాపించాయి. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన డ్రైవర్, తక్షణమే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులను వెంటనే కిందకు దించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మంటల్లో కాలిపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

