రేపు స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌‌ను ప్రారంభించనున్న మంత్రి

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్‌లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ (State Organ Transplant Center)ను శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) ప్రారంభించనున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు భాగాంగానే ప్రజలకు ఉచితంగా అవయవ మార్పిడి వైద్య సేవలను అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం ఈ సెంటర్‌‌ను ఏర్పాటు చేసింది. గాంధీ హాస్పిటల్ 8వ అంతస్తు, సౌత్ వెస్ట్ బ్లాక్‌లో సుమారు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌‌లో లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు, ఎండోకాక్లియర్ ఇంప్లాంట్స్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలు కల్పించారు.

ఆటోమేటిక్ పవర్ బ్యాకప్‌ కోసం జనరేటర్లు..

మొత్తం 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఆపరేషన్ థియేటర్లకు అనుసంధానంగా ఆడిటోరియం, 3 ట్రాన్స్‌ప్లాంట్ ఐసోలేషన్ రూములు, 25 పడకల సామర్థ్యంతో 3 ఐసీయూలు, సర్జన్లు, అనస్థీషియా నిపుణుల కోసం ప్రత్యేక లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ల తరలింపు కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌‌కు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యేకంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్, పవర్ కట్ సమయంలో ఆటోమేటిక్ పవర్ బ్యాకప్‌ కోసం జనరేటర్లు ఏర్పాటు చేశారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ట్రాన్స్‌ప్లాంట్ ఐసోలేషన్ గదుల్లో 9 ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు.

24 గంటల పాటు శుభ్రమైన గాలి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా ఇన్‌ఫెక్షన్ నియంత్రణలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్ ప్రారంభంతో రాష్ట్రంలో అవయవ మార్పిడి సేవలు మరింత విస్తరించి, అత్యవసర చికిత్సల కోసం ప్రైవేటు హాస్పిటళ్లపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు, ప్రతిష్టాత్మకంగా సనత్‌నగర్ టిమ్స్‌లోనూ అత్యాధునిక వసతులతో ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.

మదర్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించనున్న మంత్రి..

ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌‌తో పాటు.. గాంధీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్‌ (Mother Milk Bank)ను కూడా మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ సెంటర్‌‌లో తల్లి పాల సేకరణ, స్టోరేజ్ కోసం ఏర్పాట్లు చేశారు. అవసరమైన పిల్లలకు ఇక్కడి నుంచి తల్లిపాలు అందించనున్నారు. ఈ సెంటర్‌‌ను ధాత్రి అనే స్వచ్చంద సంస్థ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్, మదర్ మిల్క్ ప్రారంభించిన అనంతరం.. గాంధీ విద్యార్థుల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>