అన్నం అడిగితే ‘శిక్షా’?.. గురుకులంలో ప్రిన్సిపాల్ పైశాచికత్వం

కలం, నల్లగొండ బ్యూరో : అక్షరాలు నేర్పించి ఆదర్శంగా నిలవాల్సిన గురుకులం.. అమానుషానికి వేదికైంది. ఆకలేసి ‘అన్నం పెట్టండి’ అని అడిగిన పాపానికి విద్యార్థినుల పట్ల ఓ ప్రిన్సిపాల్ కర్కశంగా వ్యవహరించారు. కన్నవారిని వదిలి చదువు కోసం వచ్చిన ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి.. వారిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల (Damaracharla Gurukulam) బీసీ గురుకుల పాఠశాలలో వెలుగుచూసింది. హాస్టల్‌లో వడ్డిస్తున్న అన్నం సరిపోవడం లేదని, మళ్లీ వడ్డించాలని అడిగిన విద్యార్థినులపై ప్రిన్సిపాల్ విరుచుకుపడ్డారు. ‘ఎక్కువ అన్నం.. ఎక్కువ కూరలు పెట్టలేం.. ఎవరైనా అడిగితే అందరికీ ఇదే గతి’ పడుతుందంటూ బెదిరింపులకు దిగారు.

అంతటితో ఆగకుండా క్రమశిక్షణ పేరుతో రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు విద్యార్థినులను మోకాళ్ల మీద కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఆకలితో ఉన్న పిల్లలను గంట సేపు చలిలో మోకాళ్లపై ఉంచడం ప్రిన్సిపాల్ దాష్టీకానికి పరాకాష్టగా నిలిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ గురుకులాల్లో నాణ్యమైన భోజనం, వసతి కల్పిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇలాంటి అధికారులు ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. ఆకలి తీర్చమని అడిగితే శిక్షలు వేయడం ఏ రకమైన విద్యాబోధన అని విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘పిల్లలు తప్పు చేస్తే మందలించాలి కానీ, అన్నం అడిగితే ఇంతటి చిత్రహింసలా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులం (Damaracharla Gurukulam) ఈ విషయం బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.

‘గురుకులాల్లో విద్యాబోధన కంటే వేధింపులే ఎక్కువయ్యాయి. ఆడపిల్లలను చిత్రహింసలకు గురిచేసిన సదరు ప్రిన్సిపాల్‌ను వెంటనే సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విద్యార్థినులకు భరోసా కల్పించాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఆహార కల్తీ, నాసిరకం భోజనం అంశాలు చర్చనీయాంశమవుతుండగా, తాజాగా ‘అన్నం అడిగితే శిక్ష’ అనే కొత్త కోణం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సదరు ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే, గురుకులాలపై సామాన్యులకు ఉన్న నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>