కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ ఆవరణలో ఆలూరు మండలం టేకంపల్లికి చెందిన దళిత మహిళ చిన్మల నల్లా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని తమకు పరిష్కారం దొరకడం లేదని అందుకే చనిపోయేందుకు సిద్ధమైనట్లు ఆమె తెలిపారు. ముగ్గురు కలెక్టర్లకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోగా.. తమ పైనే కేసులు పెట్టి కోర్టుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కులానికి చెందిన తమ ఇంటి పక్కనే ఉన్నవారు గతంలో గొడవ పెట్టుకున్నారని ఆ విషయంలో తమ కులం వారు తమదే తప్పని కులం నుంచి బహిష్కరించారని ఆవేదన చెందుతున్నారు.
అప్పటినుంచి తమను కుల సమావేశాలకు, శుభకార్యాలకు రానివ్వకుండా బహిష్కరించారని ఆమె వాపోయింది. ముగ్గురు కలెక్టర్లు మారినా తమకు న్యాయం మాత్రం జరగలేదని ఆ దళిత మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ సమస్యతో సతమతం కావాలని ఆమె ప్రశ్నిస్తుంది. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగడం, అందులోనూ ఓ దళిత కుటుంబానికి ఇంతటి అన్యాయం జరగడం శోచనీయమని స్థానికులు అంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Read Also: స్టాలిన్ ఓటమి.. సీఎం పదవికి రాజీనామా!
Follow Us On: Instagram

