కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026 -27 బడ్జెట్ లో (Union Budget) రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ కార్యదర్శులకు సీఎస్ కె. రామ కృష్ణా రావు (CS Ramakrishna Rao) ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం డా. బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సిఎస్ఎస్ కింద ఐదు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతిపాదించిందని, దీనిలో భాగంగా 15 శాతం జనాభా ఉన్న తెలంగాణాకు కనీసం రూ 25 వేల కోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేసారు.
కేంద్ర బడ్జెట్ లో ఫార్మా, రంగ అభివృద్ధి, సెమీ కండక్టర్ తయారీ, వ్యవసాయ రంగంలో పలు అంశాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారని, ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. దీనిలో భాగంగా వరంగల్ లో మామునూరు ఎయిర్ పోర్ట్ కూడా వస్తున్నందున ఈ జిల్లాల్లో టూరిజం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధి కి గణనీయమైన అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రానికి మరో పది వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలని సీఎస్ (CS Ramakrishna Rao) సూచించారు.
16వ ఆర్థిక సంఘం కమిషన్ లో భాగంగా 2011 జనాభా ప్రాతిపదికపై నిధుల మంజూరు ఉంటుందని, దీనితో పాటు డెమో గ్రాఫిక్ ఏరియా, పథకాల అమలు సామర్ధ్యం, నిధుల వినియోగం లాంటి ప్రాతిపదికలపై కూడా నిధుల కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రధానంగా అభివృద్ధి ఆధారిత ఇండికేటర్ల ప్రాతిపదిక ప్రకారం నిధుల కేటాయింపునకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సి.వి ఆనంద్, వికాస్ రాజ్, సంజయ్ కుమార్, జయేష్ రంజన్, సవ్య సాచి ఘోష్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్, ఎన్. శ్రీధర్, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Also: ట్యాపింగ్ అయిన ఫోన్‌లన్నింటికీ అప్రూవల్ ఉందా?
Follow Us On: Sharechat


