కలం, వెబ్ డెస్క్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన కెరీర్‌లో ఆరో ప్రపంచకప్ ఆడుతున్నాడు. ఇందులో అయినా ప్రపంచకప్‌ను ఎత్తుకుని తనకు నెరవేరని ఏకైక కలను తీర్చుకోవాలన్న కసితో ఉన్నాడు. కాగా ఇంతలోనే మరో రికార్డ్ కూడా చేశాడు ఈ పోర్చుగల్ స్టార్. వచ్చే నెలలో జరగనున్న మెగా టోర్నీలో బరిలోకి దిగడం ద్వారా, ఆరు ప్రపంచకప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఫిబ్రవరిలో 41వ ఏట అడుగుపెట్టిన రొనాల్డో, తన ఆటలో వాడి ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. 2022 చివరలో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ ‘అల్ నాజర్’లో చేరినప్పుడు ఆయన కెరీర్ ముగిసిందని చాలా మంది విమర్శించారు. అయితే, మైదానంలో తన గోల్స్ వేటతో రొనాల్డో వారందరికీ సమాధానమిచ్చాడు. సౌదీ లీగ్‌లో కేవలం 105 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అక్కడ ఆడటం సులభం కాదని, 40 డిగ్రీల ఎండలోనూ తాను రాణిస్తున్నానని రొనాల్డో పేర్కొన్నారు.
పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ రొనాల్డో ప్రదర్శనపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రతి రోజూ గెలవాలనే కసి రొనాల్డోలో ఇప్పటికీ తగ్గలేదని, అది యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు. 226 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 143 గోల్స్ చేసిన రొనాల్డో, జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. గతేడాది పోర్చుగల్‌కు నేషన్స్ లీగ్ టైటిల్ అందించడంలోనూ ఆయన ముఖ్య భూమిక పోషించారు.
ఐదు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా ఉన్న రొనాల్డోకు, ఇది ఆఖరి వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా తన దేశానికి ట్రోఫీ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫిట్‌నెస్‌లో యువకులకు సవాల్ విసురుతున్న రొనాల్డో, తన ఆరో ప్రయత్నంలో సక్సెస్ అవుతాడా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

