epaper
Wednesday, February 18, 2026
epaper

బ్యాట్​ పట్టుకోవడం రానివాళ్లు కూడా సభ్యులా?.. సుప్రీం అసంతృప్తి

కలం, వెబ్​డెస్క్​: క్రికెట్​ సంఘాలను నడిపించాల్సింది రిటైరైన మాజీ ఆటగాళ్లేనని, బ్యాట్​ పట్టుకోవడం కూడా రానివాళ్లు కాదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. క్రీడా సంఘాల్లో నిపుణులు కానివాళ్లు ఆధిపత్యం చెలాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) ఎన్నికల్లో ఆటగాళ్లు కాని వ్యక్తులను ఓటర్లుగా చేర్చడంపై టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ నేత కేదార్‌ జాధవ్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం చీఫ్​ జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ, జస్టిస్​ విపుల్​ ఎం.పాంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా 1986 నుంచి 2023 వరకు ఎంసీఏలో కేవలం 164 మంది మాత్రమే సభ్యులుగా నమోదవగా, ఆ తర్వాత ఒక్కసారిగా భారీ సంఖ్యలో సభ్యులను చేర్చినట్లు ధర్మాసనం గుర్తించింది. దీనిపై స్పందిస్తూ ఎంసీఏలో సభ్యుల సంఖ్యను పెంచాలనుకుంటే ఆ స్థానాలను పేరొందిన, రిటైర్​ అయిన అంతర్జాతీయ ఆటగాళ్లకు కేటాయించాల్సిందని సూచించింది.

‘దేశంలో ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఉన్నారు. వాళ్లను చేర్చుకోవాల్సింది. కానీ, మీరు ఆటే తెలియని వాళ్లను, బ్యాట్​ ఎలా పట్టాలో రానివాళ్లను చేర్చుకున్నారు’ అంటూ వ్యాఖ్యానించింది. క్రీడా సంఘాలు ఆయా ఆటల్లోని నిపుణులైన ఆటగాళ్ల వల్లే సమర్థంగా రాణిస్తున్నాయని, నిర్వాహకుల వల్ల కాదని సుప్రీం స్పష్టం చేసింది. అనంతరం కేసును త్వరగా ముగించాలని బాంబే హైకోర్టుకు సూచిస్తూ, పిటిషన్లు వెనక్కి తీసుకునేందుకు అనుమతినిచ్చింది (Supreme Court).

కాగా, ఎంసీఏలో జనవరి 6న ఎన్నికలు జరగాల్సింది. కానీ, సంఘంలో ఒకేసారి 401 మందిని సభ్యులుగా చేర్చారని, వీళ్లలో చాలా మంది ఎన్‌సీపీ(ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌కు బంధువులు లేదా వ్యాపార భాగస్వాములని ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో బంధుప్రీతి, పక్షపాతంతో సభ్యులని చేర్చారని పేర్కొంటూ ఎంసీఏ ఎన్నికలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. దీనిపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>