కలం, జనగామ: జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సీపీఎం (CPM) ఆధ్వర్యంలో సోమవారం జనగామ (Jangaon) కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కలెక్టరేట్ ముందు నినాదాలు చేస్తూ కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవని చెప్పారు. కొనుగోలు ప్రక్రియ మందగించడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

