కలం, జనగామ : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్ణయంపై సీపీఐ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనగామ (Jangaon) పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ సాయంతో ఎర్రగొళ్లపహాడ్ గ్రామానికి చెందిన కళ్యాణి, చీటకోడూరు గ్రామానికి చెందిన చిన్న మంజుల, పొత్కనూరి విజయలక్ష్మి టీ స్టాళ్లు, మిల్క్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన రిజ్వాన్ బాషా వీరికి ప్రభుత్వ సాయం అందేలా చేసి జీవనోపాధిని చూపించారు. అయితే, కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మున్సిపల్, రెవెన్యూ అధికారులను పురమాయించి ఈ మిల్క్ సెంటర్లు, టీ స్టాళ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ మేరకు బుధవారం మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది జేసీబీలు, డోజర్లతో టీ స్టాళ్లు, మిల్క్ సెంటర్ల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. విషయం తెలుసుకున్న సీపీఐ నేతలు కలెక్టర్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తాము జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

