కలం, వెబ్ డెస్క్: బండి భగీరథ్ (Bandi Bhagirath) అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) విమర్శించారు. ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ అంతా ముద్దాయిలుగా మారారని విమర్శించారు. భగీరథ్‌ను తామే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తుంటే.. తన కొడుకును తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు పంపించానని బండి సంజయ్ అంటున్నారని నారాయణ పేర్కొన్నారు. ఈ పరస్పర విభిన్న ప్రకటనల వల్ల పోలీస్ వ్యవస్థే ప్రశ్నార్థకమైందని, ఇందులో బండి సంజయ్ కూడా ముద్దాయి అయ్యారని విమర్శించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయినప్పటికీ అతడిని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఘోర తప్పిదం చేసిందని, దీని వల్ల కోర్టుల అసమర్థత కూడా బయటపడిందని నారాయణ ధ్వజమెత్తారు.
సమాజంలో ఎవరెవరినో ఎన్‌కౌంటర్ చేసే పోలీసులు, బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడానికి కూడా చేతకానట్లు వ్యవహరించారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భగీరథ్‌ని ఎన్ కౌంటర్ చేయమని చెప్పడం లేదని, కనీసం చట్ట ప్రకారం అరెస్ట్ చేసే ధైర్యం కూడా పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ కూడా నిందితుడికి కొమ్ము కాస్తూ ముద్దాయిలుగా నిలబడ్డాయని నారాయణ విమర్శించారు.

