కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హతపై సీపీఐ నేత కె.నారాయణ (CPI Narayana) స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఎవరు సిగ్గుపడాలి..? ఎవరు గర్వపడాలి..? అని ప్రశ్నించారు. ఈ తీర్పు ఒక్క దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా చూడకూడదని సూచించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి, ఫిరాయించిన వారికి రాజకీయ ఆశ్రయం కల్పించిన పార్టీలకూ ఇది గుణపాఠమేనని నారాయణ స్పష్టం చేశారు.
దానం అనర్హతపై బీజేపీ సంబరాలు చేసుకోవడంపై ఆయన తప్పుబట్టారు. రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర బీజేపీ లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయింపులు జరిగినప్పుడు బీఆర్ఎస్ బాధిత పార్టీ మాట్లాడుతోందన్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం దొంగకు తేలు కుట్టిన చందంగా మౌనం వహిస్తోందని విమర్శించారు.
ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రధాన రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోకుండా.. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సరికాదని నారాయణ హితవు పలికారు. రాజకీయ పార్టీల రాజకీయంలో చివరికి తలవంచేది ప్రజాస్వామ్యమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులపై ఒక గుణపాఠంగా మారాలన్నారు. ఫిరాయింపులకు శాశ్వతంగా అడ్డుకట్ట పడేలా చట్టాన్ని కఠినతరం చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

