కలం, పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం (Sultanabad Mandal) రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అమృతరాణి హత్య ఘటనలో నిందితులకు, చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) తెలిపారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గురువారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ ఝా కిషోర్‌తో కలిసి అమృతరాణి తల్లిదండ్రులు ఇసాక్, రజితలను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న అమృతరాణి సింగరేణిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఈ నెల 13న ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగించి హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్నారు. కేసులో నిందితులను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయాలని రామగుండం సీపీని ఆదేశించారు. దళితులు, పేదలపై భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హై లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించిన విషయాన్ని గుర్తు చేశారు.
రూ.4.12 లక్షల పరిహారం
అమృతరాణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షల పరిహారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ.4.12 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రకటించినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం
బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం అందిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు.
మహిళలపై దాడులను ఉపేక్షించం
మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, సింగరేణిలో దళితులపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. ఘటనలపై విచారణ జరిపించి బాధ్యులైన సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

