కలం, హనుమకొండ: బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడుతున్నాయని సీపీఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు (Takkalapally Srinivas Rao) విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద విలువలకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న శక్తులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలన్నారు. ఓటు హక్కు, భావప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు అందించిన రాజ్యాంగ ఫలాలు పాలకుల విధానాలతో వారికి పూర్తిస్థాయిలో అందడం లేదని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సీపీఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

