కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నగరంలో గురువారం రాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరిట ముమ్మర వాహన తనిఖీలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. జూబ్లీహిల్స్, వెంకటగిరి, మధురానగర్, కృష్ణకాంత్ పార్క్, బోరబండ, పిలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్, సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో తాను స్వయంగా తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 8,802 బైకులు, 1,693 ఫోర్ వీలర్స్, 1,623 ఆటోలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 2,149 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాంటి వారిపై కేసులు నమోదు..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిఇలో నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ లేదా అసలు నెంబర్ ప్లేట్లు లేకపోవడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా తాము చూడబోమని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలపై ఈ తనిఖీలు కొనసాగుతాయని ప్రకటించారు. వాహనదారులు కచ్చితంగా తమతో సరైన డాక్యుమెంట్లు పెట్టుకోవాలని సూచించారు.

