కలం, వెబ్ డెస్క్ : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఈ-చలానాలు, ఇతర కీలక సమాచారాన్ని వాహనదారులు సకాలంలో తెలుసుకోవడం చాలా అవసరమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (Sajjanar) పేర్కొన్నారు. వాహనదారులు తమ ట్రాఫిక్ చలానాల వివరాలను ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా, ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా వెంటనే ‘వాహన్’ పోర్టల్ (VAHAN Portal)లో తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని ఆయన సూచించారు.
కాంటాక్ట్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, నోటిఫికేషన్లు అందకపోవడం వల్ల పడే అదనపు జరిమానాల భారం నుంచి సులభంగా తప్పుకోవచ్చని సీపీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. వాహనదారులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ‘వాహన్’ పోర్టల్ (VAHAN Portal)లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్లుగానే పరిగణిస్తారని సీపీ గుర్తుచేశారు. కాబట్టి వాహనదారులు ఎవరూ అలసత్వం వహించకుండా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని, సమాచారం తెలుసుకుంటూ జరిమానాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

