కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మొక్కజొన్న పంట వేసిన రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధర పడిపోవడం, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, దళారుల ఆగడాలతో రైతులు ఆగమవుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకొనే సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కోత పూర్తయిన తర్వాత మొక్కలను పొలాల్లోనే తూర్పారబట్టి, చెత్తను వేరుచేసి, కొంతమంది రైతులు పట్టాల్లో, మరికొంతమంది రహదారులపై ఆరబెడుతున్నారు. ఎండబెట్టిన మక్కలను ట్రాక్టర్లలో మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతులు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, మార్క్ ఫెడ్ ద్వారా మాయిశ్చర్ పరీక్షలు, నాణ్యత పరిశీలన పూర్తయ్యాకే ధర నిర్ణయిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర క్వింటాకు రూ. 2,400 ఉన్నప్పటికీ, రైతులు ఆ ధరకు పంట అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు ధర ఏది?
ఉమ్మడి వరంగల్(Warangal)లో ఈసారి సుమారు 3 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట దిగుబడి బాగానే ఉంది కానీ, ప్రభుత్వ కొనుగోలు విధానంలో జాప్యం వల్ల దళారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,200 మద్దతు ధర ప్రకటించినా, బయట మార్కెట్లో రూ.1,500-1,700కే దళారులు కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు తప్పనిసరిగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. తెరిచిన కేంద్రాల్లోనూ టార్గెట్ పూర్తయిందంటూ కొనుగోళ్లు నిలిపేస్తున్నారు.14% తేమ ఉండాల్సి ఉండగా, 16-17% ఉన్నా కొనుగోలు చేయడం లేదు. డ్రైయింగ్ యార్డ్‌లు లేకపోవడంతో రైతులు తడిసిన మక్కను ఎండబెట్టుకోలేకపోతున్నారు
గన్నీ సంచుల కొరత
ఇక గన్నీ సంచుల కొరత రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. గన్నీ సంచులు అందుబాటులో లేకపోవడంతో రోజులు తరబడి మార్కెట్ యార్డుల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది. దడ్వాయి కార్మికులు కూడా మార్కెట్ అధికారుల సూచనలు లేకుండా సంచుల్లో మక్కలు నింపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంటా పెట్టిన బస్తాలు లాట్లుగా పేరుకుపోయి, వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచుతున్నారు. అయితే ఆ బస్తాలను తరలించేందుకు డీసీఎంలు, లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ కొరత కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఎండలోనే రోజులు గడుపుతూ ఎప్పుడు తమ పంట అమ్ముడవుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.
వర్షం పడితే మక్కలు తడిసి మొలకలు వస్తాయని, భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి అధికంగా రావడంతో మార్కెట్లో స్థలం కూడా లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మక్కలను ముందుగా లారీల ద్వారా బయటకు పంపిన తర్వాతే కొత్త పంటను అనుమతిస్తామని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా గన్నీ సంచుల ఉత్పత్తి తగ్గడం, డీజిల్ కొరత కారణంగా రవాణా సమస్యలు తలెత్తినట్లు అధికారులు వివరిస్తున్నారు. రైతులు సహనంతో ఉండాలని, త్వరలోనే సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ అధికారులు చెబుతున్నప్పటికీ… కష్టపడి పండించిన పంట అమ్ముడవుతుందో లేదోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.
రైతుల ఆందోళన
మక్క బస్తాలు మార్కెట్ చేరావేయడానికి హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రైతులకు చేతికి వచ్చేది మరింత తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్, జనగామ, నర్సంపేటలో రైతులు, సంఘాల నాయకులు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం రైతుల పక్షాన మార్కెట్ యార్డ్ లను సందర్శిస్తున్నారు. వారి న్యాయం చేయాలంటూ అధికారులను కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు త్వరలోనే కేంద్రాలు ప్రారంభిస్తాం” అని చెబుతున్నా, పంట మాత్రం చేతికి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్ కల్చర్..!
Follow Us On: Instagram

