కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో (Yadadri Temple) నిబంధనలు తుంగలో తొక్కారు. కొండపైన పవిత్రతను కాపాడాల్సిన అధికారులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఫ్లెక్సీలు వెలియడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొండపైన ప్రోటోకాల్ ఆఫీసుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ఫ్లెక్సీలు (Illegal Flex Banners) దర్శనమిస్తున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు, వీవీఐపీలు, ఉన్నతాధికారులు నిరంతరం ప్రయాణించే ఈ అత్యంత కీలకమైన మార్గంలోనే ఏకంగా ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన ‘NRI ప్రాజెక్ట్’ ఫ్లెక్సీలు వెలిశాయి. యాదాద్రి పవిత్రతను దెబ్బతీసేలా, వ్యాపార ప్రకటనల బోర్డులు కొండపైకి ఎలా వచ్చాయని భక్తులు, స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనకు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సమయంలోనూ కొండ చుట్టూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అప్పట్లోనే దీనిపై స్థానిక మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ ఆలయ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారుల ఈ ఉదాసీనత వల్లే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఏకంగా కొండపైకే తమ వ్యాపార ప్రకటనలను చేరవేర్చగలిగాయని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కొండ కింది భాగంలోనే ఇంతటి కట్టుదిట్టమైన భద్రత, తనిఖీలు ఉంటే.. మరి ఈ భారీ ఫ్లెక్సీలు కొండపైకి ఎలా వచ్చాయి? అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారు?” అని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అసలు బాధ్యులు ఎవరు?
కొండపై ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నా పట్టించుకోని ఆ అధికారి ఎవరు? అసలు ఈ వ్యవహారం ఏ శాఖకు సంబంధించింది? అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు ఏ విభాగానికి చెందినవారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని వ్యాపార ప్రకటనలకు అడ్డాగా మారుస్తున్నా ఆలయ ఈఓ కార్యాలయం, భద్రతా విభాగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటో శోధించాల్సిన అవసరం ఉందని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి కొండపై వెలిసిన ఈ అక్రమ ఫ్లెక్సీలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వాటిని తొలగించడమే కాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

