కలం, కరీంనగర్ బ్యూరో : పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా మహా అభియాన్ (కరీంనగర్ (Karimnagar) జిల్లా బిజెపి శ్రేణుల శిక్షణ) తరగతులు ఈనెల 30, 31 న నిర్వహించనున్నారు. తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వేదికగా రెండు రోజులపాటు శిక్షణ తరగతులను ఘనంగా నిర్వహించడానికి, నిర్వహణ నిమిత్తం వివిధ విభాగాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు గురువారం శిక్షణ తరగతుల వేదిక ప్రాంగణం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతలతో, శిక్షణా తరగతులకు సంబంధించి వివిధ విభాగాల బాధ్యులతో సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు సిద్ధాంతపరమైన అవగాహన కల్పించేందుకు పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా మహా అభియాన్ (శిక్షణ కార్యక్రమం) దేశవ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సమగ్ర మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలపై అవగాహన కల్పించడం, పార్టీ కార్యకర్తలకు బూత్ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, సోషల్ మీడియా, సంస్థాగత బాధ్యతలపై శిక్షణ అందించడంతోపాటు కార్యకర్తల్లో క్రమశిక్షణ దేశభక్తి సేవా భావాన్ని పెంపొందించే దిశలో, పార్టీ విస్తరణ కోసం కరీంనగర్ జిల్లాలో ఈనెల 30, 31 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ముగింపు (సమారోప్) కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ అపేక్షితులు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని గంగాడి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రశిక్షణ కన్వీనర్ మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, సంచలన సమితి ప్రముఖ్ గుజ్జ శ్రీనివాస్, కార్యక్రమ ప్రముఖ్ కళ్ళెం వాసుదేవ రెడ్డి, వ్యవస్థ ప్రముఖ్ ఈనకొండ నాగేశ్వర్ రెడ్డి, సహ ప్రముఖ్ చింతం శ్రీనివాస్, వివిధ విభాగాలకు సంబంధించిన ప్రముఖ్ లు, ప్రబంధకులు పాల్గొన్నారు.

