Mobile Popup Ad
Mobile Popup Ad

పదవుల కోసం పాలమూరు కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ పాలమూరులో(Palamuru) అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీ పదవుల పంపకాల విషయంలో నేతలు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరుకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధిష్టానం సూచనలను సైతం కొందరు నేతలు పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్‌లో ప్రస్తుతం నగర అధ్యక్ష పదవి కోసం కొత్త పోరు మొదలైంది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు పార్టీని మరింతగా విభజించాయి. మేయర్ పదవి విషయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మధ్య విభేదాలు తలెత్తడంతో వర్గపోరు మరింత ముదిరింది.

మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ భార్యకు మేయర్ పదవి ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌తో పాటు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బి. అనిత పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు, తన కుమారుడికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్త్వాల్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలలో ఆనంద్ గౌడ్ సొంత కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని ఆరోపిస్తూ, ఆయన కుటుంబానికి మేయర్ పదవి ఇవ్వవద్దని ముడా చైర్మన్ లక్ష్మన్ యాదవ్, సీనియర్ నేతలు ఎన్‌పి వెంకటేష్, వినోద్ కుమార్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఆనంద్ గౌడ్ భార్యకు మేయర్ పదవి దక్కలేదు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన గుమ్మాల మమతకు మేయర్ పదవి కట్టబెట్టారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తానన్న హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కింది. ఈ పరిణామాలతో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తన వర్గానికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిష్టానం ఇరువర్గాలను సమన్వయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్త్వాల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బి. అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కలిసి మరో వర్గంగా కొనసాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది.ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలకు డీసీసీ వర్గం దూరంగా ఉంటుండగా, పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక అంశం మరోసారి వర్గపోరుకు దారితీసింది.

Read Also: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: రాహుల్ గాంధీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>