Mobile Popup Ad
Mobile Popup Ad

మాదిగలకు రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి: కాంగ్రెస్ నేత‌ పిడమర్తి రవి

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కులగణన లెక్కల ప్రకారం మాదిగ జనాభా అతి పెద్దద‌ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి (Pidamarthi Ravi) అన్నారు. దాదాపు 37 లక్షల జనాభా, 11 శాతం ఉన్న మాదిగలకు అన్ని విషయాల్లో అంతే శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నుండి మాదిగ ఎమ్మెల్యేలు ఐదు మంది మాత్రమే ఉన్నారని, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేరని, నామినేటెడ్ పోస్టుల్లో ఒకే ఒక్క‌రు మాదిగ ఉన్నార‌ని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలకు పొంతన లేకుండా పోయిందన్నారు. ఇకపై ప్రభుత్వం ఇచ్చే ఏ నియమకాల్లోనైనా మాదిగలకు 11 శాతం సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న నామినేటెడ్ పోస్టుల్లో, జిల్లా పరిషత్ ఎన్నికలలో జిల్లా పరిషత్ చైర్మన్లలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

మధిర.. మాదిగల ఆత్మ గౌరవం

మధిర మాదిగల ఆత్మగౌరవమని టీపీసీసీ మాజీ కార్యదర్శి వక్కలగడ్డ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జనగణన నివేదికను పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో తెచ్చి అందరి జాతకాలను బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత‌లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 2 లక్షలకు పైగా అతిపెద్ద కులంగా మాదిగ కులం ఉందన్నారు. జిల్లాలో రెండు ఎస్సీ సీట్లలో మధిర మాల దాసరి 0.01 శాతం, సత్తుపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. జిల్లాలో ఎస్సీలలో మూడింటి రెండువంతులు ఉన్న మాదిగలకు కనీసం ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ కూడా దక్కకుండా కుట్రలు చేశారన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మధిరలో మాదిగలు అత్యధికంగా 60 వేల వరకు ఉన్నారన్నారు, అటువంటి చోట కూడా మాదిగ గాని, కనీసం మాల గాని ఎమ్మెల్యేగా లేకపోవడం శోచనీయమన్నారు. దీనిపై పార్టీ పెద్దలు రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవాలు తెలియజేస్తామన్నారు. మధిర నియోజవర్గం మాదిగల ఆత్మగౌరవమని, ఈసారి కచ్చితంగా మధిరను సాధించి తీరుతామన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న రెండు ఎస్సీ సీట్లను మాదిగలకే సాధించి తీరుతామన్నారు. జిల్లాలో మాదిగలు ఎప్పుడూ కాంగ్రెస్ పక్షానే నిలబడి గెలుపులో కీలకపాత్ర పోషించారని, అటువంటి వారికి కనీసం ప్రాతినిధ్యం లేకపోవడమనేది అత్యంత దురదృష్టకరమన్నారు. మాదిగలకు జరిగిన ఈ అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని, ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవుల్లో ఖమ్మం జిల్లా మాదిగలకు సముచిత స్థానం కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ బొబ్బిలి భరత్ చంద్ర, కూసుమంచి మాజీ ఎంపీపీ ఎడవల్లి ముత్తయ్య, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>