కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను అరవింద్‌ను సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆయన మాటలు కేవలం ప్రెస్ మీట్‌లకే పరిమితమని, ఆ ఆరోపణలన్నీ ముమ్మాటికి నిరాధారమైనవని తీవ్రంగా కొట్టిపారేశారు.
ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళ్లాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తమకు ఎక్కడా పుట్ట గతులు ఉండవనే ఉద్దేశంతోనే అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్కామ్‌లే లేవనే విషయం అందరికీ తెలుసని అన్నారు.
ఒకపక్క నీట్ పేపర్ లీక్‌తో దేశ యువత మీ ప్రధానమంత్రి మోడీపై ఉద్యమాలు చేస్తుంటే దాన్ని పక్క ద్రోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా అరవింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా యువతకు ఆదర్శమని చెప్పుకునే మీలాంటి వాళ్లు నీట్ పైన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని, ఎందుకు మాట్లాడలేరని ప్రశ్నించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంపీగా అరవింద్ చేస్తున్న ప్రయత్నం ప్రజలు నమ్మరని ఖండించారు. గత వారం పది రోజులుగా పెట్టిన రెండు మూడు ప్రెస్ మీట్‌లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. “అరవింద్ గుర్తుంచుకో.. ఆకాశం పైన ఉమ్మేస్తే అది నీ మొహం పైనే పడుతుంది అని గుర్తుంచుకోకపోతే జరిగే పరిణామాలు అన్ని కూడా నిశితంగా ప్రజలు గమనిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
రెండేళ్లు గడిచినా పార్లమెంట్ సభ్యుడుగా కనీసం నిజామాబాద్ జిల్లా సమస్యలపై ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదని విమర్శించారు. తీరు మార్చుకోకుండా ఇదే విధంగా కొనసాగితే త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ విషయంలో మోడీతో ఫైట్ చేయండి, మీతో కలిసి రావడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఖబర్దార్ అరవింద్ ఇంకొకసారి తప్పుడు ఆరోపణలు చేస్తే అంటూ ఘాటుగా స్పందించారు. అవినీతి గురించి మాట్లాడే నైతికత అరవింద్ కు లేదని దుయ్యబట్టారు.

