Mobile Popup Ad
Mobile Popup Ad

ముస్లింల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోంది: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. విదేశీ ముస్లింలతో ఈ దేశ ముస్లింలను ఎందుకు పోలుస్తున్నారని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. మతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకే సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తోందన్నారు. వాస్తవానికి ఈ దేశ పౌరుల ఓట్లను తొలగించే హక్కు ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నారని సీఎం చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదు..

కిషన్ రెడ్డి అడ్డుకోవాలని అనుకుంటే తెలంగాణకు ఇంత పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలని కోరారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు సైతం మోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మావోయిస్టు భావజాలం ఉన్న నేతలు ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని చెప్పారు. అలాంటి నేతలతోనే సమాజానికి పెను ప్రమాదమని అన్నారు. మావో భావజాలం, తుపాకీ గొట్టంతో సాధించేదేమీ లేదనే నిజాన్ని గ్రహించే మావోయిస్టు నేతలంతా ప్రభుత్వం వద్ద లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. మావోయిస్టు భావజాలాన్ని వీడకపోతే భవిష్యత్తులో వారికే నష్టమని బీఆర్ఎస్ లోని మావో భావజాల నేతలను హెచ్చరించారు.

ఆర్ఎంపీ డాక్టర్లతో ‘‘చాయ్ పే చర్చ’’

మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వివిధ వర్గాలతో నేతలను కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్న బండి సంజయ్ కుమార్ అందులో భాగంగా మానకొండూరు లోని ఓ ఫంక్షన్ హాలులో ఆర్ఎంపీ డాక్టర్లతో ‘‘చాయ్ పే చర్చ’’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. “దేశ చరిత్రలో 4400కు పైగా రోజులు ప్రధానిగా చేపట్టిన చరిత్ర నరేంద్రమోదీకే దక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగానే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై విస్త్రత కార్యక్రమాలు చేస్తున్నాం. వివిధ వర్గాల నేతలను కలుస్తున్నాం” అని చెప్పారు.

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

ఈ దేశ పౌరుల ఓట్లను తొలగించే హక్కు ఎవరికీ లేదు. ఎస్ఐఆర్(సర్) విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. విదేశీ ముస్లిం చొరబాటుదారులను ఈ దేశ ముస్లింలతో పోల్చి కాంగ్రెస్ అవమానిస్తోంది. ఇక్కడి ముస్లిం ఓట్లను తొలగించి విబేధాలు స్రుష్టించేందుకు కుట్ర చేస్తోంది. నేనడుగుతున్నా…. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాటు దారులు పాస్ పోర్టు, వీసా లేకుండా చొరబడి ఓటర్ కార్డు పొందితే చూస్తూ ఊరుకోవాలా? వాటిని తొలగించాలని ఎందుకు కాంగ్రెస్ అడగడం లేదు? విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందా? అసలు విదేశీ ముస్లింలను స్వదేశీ ముస్లింలతో ఎందుకు పోలుస్తున్నారు? ఇక్కడి ముస్లిం సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. అక్రమంగా వలస వచ్చిన వాళ్ల ఓట్లను మాత్రమే తొలగిస్తాం. తొలగించాలా? వద్దా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. బెంగాల్ లో అక్రమ వలసదారుల ఓట్లను తొలగించాం తప్పేముంది?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>