కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత భూ ఆక్రమణకు తెర లేపాడు. తన అధికార బలంతో 130 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని కబ్జా పెట్టాడు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అండదండలతో ఈ భారీ భూ అక్రమాలకు పాల్పడ్డాడు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని రియల్ వ్యాపారి, ఆయన కుటుంబ సభ్యులకు ఎలా దక్కిందనేదానిపై అధికారుల దగ్గర సమాచారం లేదని చెబుతున్నారు. రూ.40 కోట్ల విలువైన భూమిని రియల్ వ్యాపారి బదలాయింపు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తిరిగి ఆ భూమిని తమకే కేటాయించాలని అక్కడి దళితులు కోరుతున్నారు.
పేదల భూమి పెద్దల పాలు
హనుమండ (Hanumakonda) జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలో ఈ భూదందా చోటుచేసుకుంది. సర్వే నెం.324లో అప్పటి భూస్వామ్య కుటుంబం పింగిళి వెంకట్రాంరెడ్డి వారసులు 138.32 ఎకరాల భూమిని సీలింగ్ డిక్లరేషన్లో భాగంగా ప్రభుత్వానికిచ్చారు. ఈ భూమిలో 121.14 ఎకరాల భూమిని 73 మంది పేదలకు 1994లో ఒక్కొక్కరికి 20 గుంటల నుండి 2ఎకరాల 20 గుంటల వరకు ప్రభుత్వమే అసైన్డ్ చేస్తూ అలాట్ మెంట్ చేసింది. ఇందులో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. ఇది జరిగి 32 సంవత్సరాలు గడించింది. ఇప్పటి వరకు ఈ భూమిపైనా వీరెవ్వరూ వ్యవసాయం చేయడం లేదు. విచిత్రమేమిటంటే అసలు వీరిలో ఎక్కువ మందికి ఈ భూమి తమదే అన్న విషయం కూడా తెలియదు. తమకు ప్రభుత్వం భూమి పంపిణీ చేసిందని తెలియదు. ప్రస్తుతం ఈ భూమి మార్కెట్ విలువ ఎకరానికి 40 లక్షల వరకు ఉంది. సారవంతమైన భూమి, ఏపంట వేసినా బాగా పండే అవకాశమున్న సాగు భూమి. మరి ఇంత విలువైన సారవంతమైన భూమిని పేరుకే అసైన్డ్ చేసి వారికివ్వకుండా ఎందుకు బడా నేతకు కట్టాబెట్టారో అనే విషయంలో అధికారుల వద్ద సమాధానం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ధరణి పోర్టల్ లొసుగులతో..
2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి వెబ్ పోర్టల్ తీసుకొచ్చింది. ఇదే అదనుగా భావించిన ఈ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్టా మనోజ్ రెడ్డి అధికారులను మేనేజ్ చేసి ఈభూమిని తనతో పాటు కుటుంబ సభ్యుల పేరుపై మార్చుకున్నట్లు రికార్డులో ఉంది. అప్పుడున్న తహశీల్దార్ వీరికి పట్టాలు చేశారని ప్రస్తుత అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రికార్డులు మాత్రం అందుబాటులో లేవని పేర్కొనడంతో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
రెవెన్యూ మాయాజాలం..
సర్వే నెం. 324లో బైనెంబర్లు C, D, E, F, G, H, I వరకు మొత్తం 386 ఎకరాల వ్యవసాయ భూమి ఖాస్రాలో ఉంది. ఆది నుంచి కూడా ఆక్రమణదారుడు కట్టా మనోజ్ రెడ్డి, అతనికి సంబంధించిన వ్యక్తులుగానీ ఎప్పుడూ ఎక్కడా రికార్డుల్లో లేరు. కానీ సర్వే నెంబర్ 324/Hలో మాత్రం ఒకరి పేరున 114 ఎకరాల 13 గుంటలు ఉంది. కానీ 2018 ఆగష్టులో సుమారు 80 ఎకరాల భూమిపైన కబ్జాలోకి రికార్డుల్లోకి వచ్చాడు. ఎవరి దగ్గర నుంచి ఎలా వచ్చిందన్నది మాత్రం సస్పెన్స్, ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సర్వే నెం.324/D లో ఖాస్రా మొత్తం భూమి 58.17 ఎకరాలు మాత్రమే. ఇందులో పట్టాదారులు 20 మంది వరకు తలా కొంత భూమి ఉంది. కబ్జాలో కూడా ఉన్నారు. వీళ్లెవరూ ఆక్రమణదారుకు భూమిని అమ్మలేదు, కానీ ఇదే ఆక్రమణదారు 2018 ఆగష్టులో 324/D/1 అనే కొత్త సిరీస్ తో 17 ఎకరాల భూమిని రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. ఈ సర్వే నెంబరులో ఉన్న మొత్తం భూమి ఇప్పుడు 75.27 ఎకరాలు అయ్యింది. ఖాస్రాకు మించి రికార్డుల్లోకి ఎక్కించారు. ఇదెలా సాధ్యమవుతుందో అధికారుల దగ్గర సమాధానం లేదు. ఈ నేపథ్యంలో కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు బుట్ట దాఖలు..
1970లో అప్పటి భారత ప్రభుత్వం భూసంస్కరణల చట్టం తెచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో వేసిన కోనేరు రంగారావు కమిషన్ సిఫారసుల మేరకు ఒకసారి పేదలకు అసైన్డ్ కాబడిన ప్రభుత్వ భూమిని ఇతరులకు బదలాయించడానికి వీలులేదు. ఒకవేళ బదలాయింపు జరిగినా అది చెల్లనేరదు అని చట్టమే చెపుతున్నది. మరి చట్టం ఇలా వుంటే ఈ భూమి రికార్డుల్లోకి అసైన్ చేసిన వారు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎలా వచ్చారో అధికారులే చెప్పాలి. సర్వే నెం. 324లో ప్రభుత్వ భూమి అందులో అసైన్డ్ చేయబడిన భూమి ఉందని మండల రెవెన్యూ అధికారులకు తెలియకుండా జరిగే పనికాదు. అప్పటి అధికారులు కావాలనే ఈ భూమిని మనోజ్ రెడ్డికి కట్టబెట్టినట్టు స్పష్టమౌతోందని సీపీఐ నేతలు వెంకటరాజ్యం, రవి పేర్కొంటున్నారు.
కలెక్టర్ కు ఫిర్యాదు, విచారణకు ఆదేశం..
అయితే ఈ అక్రమ భూదందాపై హనుమకొండ (Hanumakonda ) జిల్లా కలెక్టర్ చాహత్ భాజపాయ్ (Collector Chahat Bajpai) కు ఫిర్యాదులు అందాయి. స్పందించిన కలెక్టర్ స్థానిక తహసీల్దార్ ను విచారణ కు ఆదేశించారు. మరోవైపు ఈ భూదందాపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్థావించారు. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి కోట్లాది రూపాలయ విలువైన భూమిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Read Also: కాజీపేటలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. బైక్‌పై వచ్చి చోరీ!
Follow Us On: Facebook

