కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ (Congress) రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం మిస్ కావడంతో ఆమెను తెలంగాణ నుంచి పంపించాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నది. ఏఐసీసీ, పీసీసీ ఆలోచన మేరకు సాధ్యాసాధ్యాలు, అవకాశాలపై చర్చ మొదలైంది. దానికి కొనసాగింపుగా గాంధీభవన్‌లో ఈ విషయం ఆదివారం ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున ఆయన రాజీనామాతో మీనాక్షికి అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మీనాక్షిని రాజ్యసభకు పంపాలంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల్లో ఎవరో ఒకరు రాజీనామా చేయక తప్పని పరిస్థితి. ప్రస్తుతం ఎలాంటి ఖాళీ లేవు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత సీటు త్యాగం చేసేవాళ్లలో అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. రాజ్యసభ నుంచి తప్పుకుంటే పార్టీలో కానీ, పాలనలో కానీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నది కాంగ్రెస్ నిర్ణయం. అనిల్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయనకు మేయర్‌గా అవకాశం ఇచ్చే చాన్స్ కనిపిస్తున్నది. దీనికి తోడు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలన్నది కూడా మరో ఆలోచన.
కాంగ్రెస్‌కు నమ్మకమైన ఫ్యామిలీ
కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ నమ్మకమైన కుటుంబం అనే గుర్తింపును అనిల్ కుమార్ యాదవ్ ఫ్యామిలీ సొంతం చేసుకుంది. ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అంజన్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అనిల్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ సెక్రటరీగా, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పార్టీకి వివిధ రూపాల్లో సేవలందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన అనిల్ కుమార్ యాదవ్‌ను 2024లో రాజ్యసభకు ప్రతిపాదించగా.. ఏఐసీసీ ఆమోదం తెలిపింది. రెండేండ్లుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అనిల్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుపొందలేదు. ఆయన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ లాయల్‌గా ఉన్నదనే అభిప్రాయంతో రాజ్యసభకు అవకాశం లభించింది. అనిల్ కు మరో నాలుగేండ్ల పదవీ కాలం ఉంది. ఇప్పుడు తన సీటును పార్టీ ఇన్చార్జి మీనాక్షి కోసం త్యాగం చేస్తే.. ఆయనకు మంచి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. రాజీనామా చేసిన వెంటనే ఉప ఎన్నిక వస్తే.. మీనాక్షిని గెలిపించి, బీజేపీకి చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది.
స్వచ్ఛందంగానే రిజైన్!
అనిల్ రాజీనామాతో జరిగే ఉప ఎన్నికలో మీనాక్షిని రాజ్యసభకు పంపాలని ప్రస్తుతం ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. గాంధీభవన్ వేదికగా కొందరు లీడర్ల మధ్య ఈ ప్రతిపాదనపై డిస్కషన్ కూడా నడిచింది. అయితే.. ఈ విషయాన్ని ఇంకా అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారా?.. ఆయన స్పందన ఎలా ఉన్నది?.. తదితరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారానే అనిల్ను కన్విన్స్ చేసే అవకాశాలున్నాయి. సీఎం చెప్పిన తర్వాత ‘నో’ అనే సమాధానం రాకపోవచ్చన్నది పీసీసీ నాయకుల భావన. పదవిని త్యాగం చేసినందుకు తగిన గౌరవం, గుర్తింపు ఉండేలా పార్టీ ప్రత్యామ్నాయం చూపిస్తుందని, జీహెచ్ఎంసీకి ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో మేయర్ పదవిని ఇవ్వడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి మరోసారి పోటీచేసే అవకాశం ఇస్తుందనేది పార్టీ ప్రతిపాదనగా వినిపిస్తున్నది.
మిగిలిన ముగ్గురిపై పార్టీకి భిన్నమైన ఆలోచన
మీనాక్షి కోసం ఇప్పుడు రాజీనామా చేసే రాజ్యసభ మెంబర్కు జీహెచ్ఎంసీ మేయర్ పోస్టు ఇవ్వాలన్నది కాంగ్రెస్ నిర్ణయం కావడంతో అనిల్ కుమార్‌తో పోలిస్తే మిగిలిన ముగ్గురు పార్టీ రాజ్యసభ సభ్యులకు పదవి నుంచి తప్పుకునేందుకు తక్కువ అవకాశాలున్నాయి. అభిషేక్ మను సింఘ్వి ఉత్తరాది రాష్ట్రానికి చెందినవారు కావడం, రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాకు చెందినవారు కావడం, రాజ్యసభకు ఇటీవలే ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు కావడంతో వారికి జీహెచ్ఎంసీ మేయర్ అవకాశం ఇవ్వడం సహేతుకం కాదన్నది పార్టీ అభిప్రాయం. తెలంగాణలోని కేసు కారణంగా మీనాక్షి నామినేషన్‌ను మధ్యప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో అదే తెలంగాణ నుంచి ఆమెను రాజ్యసభకు పంపడం బీజేపీ కుట్రలకు తగిన ఎత్తుగడగా ఉంటుందన్నది ఏఐసీసీ ఆలోచన. మీనాక్షిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకోనున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ఈ వారంలోనే దీనిపై చర్చల అనంతరం కొంత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

