Mobile Popup Ad
Mobile Popup Ad

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. అనామక పార్టీలోకి TMC రెబల్స్

కలం, ఢిల్లీ: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం పతాకస్థాయికి చేరుకున్నది. రెబల్ ఎంపీలు 20 మంది ఎంపీలు ఆదివారం నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమయ్యారు. ఈ మేరకు వారంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ సమర్పించారు. ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్‌గా గుర్తింపు పొందడంలో చట్టపరమైన ఇబ్బందులు ఉండటంతో ఇప్పటికే గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ అయిన నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాతో కలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. “మేము నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీలో చేరాం. అది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ. మేము ఆ పార్టీలోనే విలీనమయ్యాం. అసలైన టీఎంసీ ఏదన్నది కోర్టులో తేలుతుంది” అంటూ తిరుగుబాటు ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ వ్యాఖ్యానించారు. టీఎంసీకి లోక్‌సభలో 28 మంది ఎంపీలు ఉండగా.. వారిలో 20 మంది ఎన్ సీపీఐలో విలీనం అయ్యారు. మరో ఇద్దరు కూడా రెబలో ఎంపీల వెంట వెళ్లబోతున్నట్టు సమాచారం.

స్పీకర్ నివాసంలో సమావేశం..

ఈ పరిణామానికి ముందు తిరుగుబాటు వర్గానికి చెందిన ఎంపీలు ఢిల్లీలోని స్పీకర్‌ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌తోనూ వారు భేటీ అయ్యారు. ఈ సమావేశాల నేపథ్యంలో తిరుగుబాటు ఎంపీలు పార్లమెంట్‌లో ‘అసలైన టీఎంసీ’గా గుర్తింపు కోరే అవకాశముందని రాజకీయ వర్గాలు భావించాయి. మరోవైపు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. టీఎంసీని ఒకే రాజకీయ పార్టీగా పరిగణించాలని, విడిపోయిన ఏ వర్గానికీ ప్రత్యేక గుర్తింపు లేదా సౌకర్యాలు కల్పించవద్దని కోరారు.

సుదీప్‌ బందోపాధ్యాయ్‌ మద్దతుతో బలం..

తిరుగుబాటు వర్గానికి టీఎంసీ పార్టమెంటరీ పార్టీ అధ్యక్షుడు సుదీప్‌ బందోపాధ్యాయ్‌ కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. మాజీ కేంద్ర మంత్రి, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా భావించే సుదీప్ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌లతో సమావేశమయ్యారు. అనంతరం తిరుగుబాటు వర్గానికి మద్దతు ప్రకటించారు. తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకే తాను ఆ వర్గంలో చేరినట్లు చెప్పుకొచ్చారు.

తిరుగుబాటు నేతలపై వేటు..

సుదీప్‌ బందోపాధ్యాయ్‌ తిరుగుబాటు వర్గంలో చేరిన కొద్ది గంటల్లోనే టీఎంసీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. తిరుగుబాటు నేతలు సయోనీ ఘోష్‌, మాలా రాయ్‌, సుదీప్‌ బందోపాధ్యాయ్‌లను పార్టీ పదవుల నుంచి తొలగించింది. తృణమూల్‌ యువజన విభాగం అధ్యక్షురాలిగా ఉన్న సయోనీ ఘోష్‌ స్థానంలో అర్నబ్‌ బెనర్జీని నియమించింది. మహిళా విభాగం అధ్యక్షురాలు మాలా రాయ్‌ స్థానంలో కాలిగంజ్‌ ఎమ్మెల్యే అలీఫా అహ్మద్‌ను నియమించింది. అలాగే ఉత్తర కోల్‌కతా సంస్థాగత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సుదీప్‌ బందోపాధ్యాయ్‌ స్థానంలో కునాల్‌ ఘోష్‌ను నియమించింది. మమతా బెనర్జీకి విధేయులుగా ఉన్న లోక్‌సభ సభ్యుల విభాగానికి ముఖ్య సలహాదారుగా సౌగత రాయ్‌ను నియమించింది.

టీఎంసీ సంక్షోభం ఎలా మొదలైంది?

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పరాజయం అనంతరం ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. 15 ఏళ్ల తర్వాత అధికారాన్ని కోల్పోయిన టీఎంసీ, 294 స్థానాల అసెంబ్లీలో కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్‌ సహా 60 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందంటూ లేఖ సమర్పించారు. ఆ లేఖపై 58 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష నేత పదవికి రితబ్రత బెనర్జీ పేరును ప్రతిపాదించారు.

ఎన్‌డీఏకు మద్దతు..

అనంతరం టీఎంసీ లోక్‌సభ ఎంపీలు, చీఫ్‌ విప్‌ కాకోలి ఘోష్‌ దస్తిదార్‌ నేతృత్వంలో స్పీకర్‌కు లేఖ రాసి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు. దీంతో పార్టీ పార్లమెంటరీ విభాగంలో అధికారికంగా చీలిక ఏర్పడింది. సహచర ఎంపీలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాకోలి ఘోష్‌ దస్తిదార్‌ వెల్లడించారు. టీఎంసీలో కొనసాగుతున్న ఈ రాజకీయ పరిణామాలు పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>