కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) మున్సిపాలిటిలో మొత్తం 37 వార్డులలో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బిజెపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 వార్డులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 19 ఏ పార్టీకి రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో స్ధానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు(Manik Rao), జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా నమోదు చేసుకున్నారు. దీంతో మ్యాజిక్ పిగర్ 20కి చేరింది. ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యే ఉండటంతో 20 మంది మద్దతుతో చైర్మన్ పదవి స్వంతం అవుతుందని అంతా అనుకున్నారు. అందులో భాగంగా మొదటి చైర్మన్ ఎన్నిక కోసం 16వ తేదిన బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు, ఎమ్మెల్యే వచ్చారు. కానీ ఎవరు ఊహించని విధంగా స్వతంత్రులు రాకపోవడం కారణంగా ఎన్నిక వాయిదా పడింది. అయితే 16 వార్డు నుండి ఇండిపెండెట్‌గా గెల్చిన కొత్తకాపు శిరీష బీఆర్ఎస్ (BRS)కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. జహీరాబాద్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు స్పష్టమైన హమీ ఇవ్వకపోవడంతో.. ఆమె చివరి నిముషంలో కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చి వైస్ చైర్ పర్సన్‌గా ఎంపికైంది. దీనితో జహీరాబాద్ మున్సిపాలిటీని ఒక్క ఓటుతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
నామ రవికిరణ్‌కు చెక్ పెట్టాలనే…
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్ (Nama Ravikiran) భార్య స్రవంతి 27 వార్డు నుండి గెలవగా.. ఆమెను అధిస్టానం చైర్మన్ అభ్యర్ధిగా ప్రకటించింది. నామ రవి కిరణ్ తెలంగాణ ఉద్యమ సమయం నుండి పార్టీని, సిద్ధంతాలను నమ్ముకొని జహీరాబాద్‌లో పార్టీకి క్రీయశీలకంగా పనిచేశాడు. నామ రవికిరణ్ బీఆర్ఎస్ ముఖ్యనేత మాజీ మంత్రి, హరీశ్ రావుకి అత్యంత సన్నహితుడు. బీఆర్ఎస్ పార్టీ తరుపున కౌల్సిలర్‌గా గెలిచి పదేళ్లుగా జహీరాబాద్ మున్సిపాలిటిలో అన్నితానై నడిపించాడు. తిరిగి నామ రవికిరణ్ భార్య చైర్మన్ అయితే తమ పట్టు తగ్గుతుందని భావించిన జహీరాబాద్ బీఆర్ఎస్ ముఖ్యనేతలు నామా రవికిరణ్‌ను చైర్మన్ కాకుండా చేశారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో భాగంగా మద్దతు ఇస్తామని ముందుకు వచ్చిన స్వతంత్రులను సరైన రీతిలో డీల్ చేయకుండా వారు కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా చేసి, కాంగ్రెస్‌కు చైర్మన్ అవ్వడానికి సహకరించారని నామ రవి కిరణ్ అనుచరులు అరోపిస్తున్నారు.


