Mobile Popup Ad
Mobile Popup Ad

మంచి నిద్ర కావాలంటే ఈ చెడు అలవాట్లకు చెక్ పెట్టండి

కలం, వెబ్‌డెస్క్: నిద్ర (Sleep) అనేది మనిషి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మనం జీవించడానికి మంచి ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో, తగినంత నిద్రపోవడం (Sleep Quality) కూడా అంతే అవసరం. ఒక మనిషి శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండటానికి రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనం చేసే కొన్ని పొరపాట్లే మనకు నిద్రను దూరం చేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆ పొరపాట్లు ఏమిటో? వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పడుకునేముందు ఫోన్ చూడటం

ఈ రోజుల్లో చాలామందికి నిద్ర పట్టకపోవడానికి మొబైల్ ఫోనే అతి పెద్ద శత్రువు అంటున్నారు నిపుణులు. పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే ‘నీలి కాంతి’ (Blue Light) మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది నిద్రను నియంత్రించే ‘మెలటోనిన్’ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల నిద్రలేమి, చిరాకు, పగటిపూట నీరసానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

2. కాఫీ, టీలు తాగడం

పడుకునే ముందు కాఫీ, టీ తాగడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాఫీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజితం చేసి నిద్ర రాకుండా చేస్తుందట. అందుకే పడుకునే నాలుగు గంటల ముందు కాఫీ, టీ తాగొద్దని సూచిస్తున్నారు నిపుణులు.

3. రాత్రిపూట ఎక్కువగా తినడం

పడుకునే ముందు కడుపు నిండా భోజనం చేయడం వల్ల కూడా నిద్ర పట్టదని సూచిస్తున్నారు నిపుణులు. మనం భారీగా భోజనం చేయడం వలన శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కష్టపడుతుందట. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అందుకే పడుకునే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.

4. పగటిపూట నిద్రపోవడం

పగటిపూట గంటలు గంటలు నిద్రపోవడం వల్ల కూడా రాత్రి నిద్ర దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే మధ్యాహ్నం సమయంలో పడుకోకపోవడం ఉత్తమం అంటున్నారు. ఒకవేళ పడుకున్నా కేవలం 15 – 20 నిమిషాల చిన్నపాటి కునుకు తీస్తే ఇబ్బంది ఉండదట. కానీ గంటలకొద్దీ పడుకోవడం వలన రాత్రి నిద్ర నాణ్యత నేరుగా దెబ్బతింటుందని సూచిస్తున్నారు నిపుణులు.

5. అతిగా ఆలోచించడం

చాలా మంది పడుకునే ముందు ఆ రోజంతా జరిగిన విషయాల గురించి అతిగా ఆలోచిస్తుంటారు. ఈ అలవాటు మెదడును ఒత్తిడికి గురి చేస్తుందట. దీనివల్ల మెదడు విశ్రాంతి తీసుకోలేక నిద్రకు దూరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

6. ధూమపానం, నికోటిన్ ప్రభావం

సిగరెట్లు తాగడం వలన కూడా నిద్ర సరిగ్గా పట్టదని చెబుతున్నారు నిపుణులు. ఈ అలవాటు ఉన్నవారిలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుందట. పొగాకులో ఉండే నికోటిన్ ఒక ఉద్దీపనగా పనిచేసి మెదడును చురుగ్గా ఉంచడం వలన ప్రశాంతంగా నిద్రపోవడం అసాధ్యమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

7. ఒత్తిడి, కార్టిసాల్ హార్మోన్

నిద్రలేమికి మరొక సమస్య అధిక ఒత్తిడి. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుందట. ఇది నిద్ర-మేల్కొలుపు వ్యవస్థను దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. నిశ్చల జీవనశైలి (శారీరక శ్రమ లేకపోవడం) కూడా నిద్రలేమికి ఒక ప్రధాన కారణం. కాబట్టి రోజువారీ వ్యాయామం, యోగా వంటివి అలవరచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని మంచి నిద్రను పొందవచ్చట.

ఈ అలవాట్లు క్రమంగా దూరం చేసుకోవడం వలన ప్రశాంతమైన నిద్రను పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>