కలం, నిర్మల్: ఈ నెల 30వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి (Indervelly) మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్న తెలంగాణ రక్షన సేన (టీఆర్‌ఎస్) పాంచజన్య సంకల్ప సభ (Panchajanya Sankalpa Sabha) ను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్థన్ (Boda Janardhan) పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో కార్యక్రమం గోడ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు.
ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యాలుగా కల్వకుంట్ల కవిత ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఆశించిన స్థాయిలో మేలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులు, సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో జాప్యం జరుగుతోందని, నిరుద్యోగులకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు నిర్మల్ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దూప్ సింగ్, జిల్లా అధ్యక్షుడు రాము, నియోజకవర్గ ఇన్చార్జి చంద్రప్రకాష్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

