కలం, వెబ్ డెస్క్: అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) ప్రభావం తెలంగాణలోని పలు ప్రాంతాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. తుఫాన్ ప్రస్తుతం విశాఖపట్నం సముద్ర తీరానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం, బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని కారణంగా తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. హైదరాబాద్ నగరంలో తక్కువ ప్రభావమే ఉంటుందన్నారు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ తీర ప్రాంతం వైపు కదులుతోందన్నారు.
అల్లకల్లోలంగా సముద్రం..
అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) కారణంగా ఏపీలోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలల ధాటికి ఉప్పాడ-కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకపడటంతో రహదారి దెబ్బతిన్నది. దీంతో అధికారులు అప్రమత్తమై అటు వైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టారు. తుఫాన్ ప్రభావం ఉన్న అన్ని జిల్లాల్లో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు నిరంతరం సమీక్షలు జరుపుతున్నారు.
Also Read : మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. కోతలు షురూ!
Follow Us On: Youtube

