జవహార్ నగర్ డంపింగ్ యార్డు.. ఈటల పాదయాత్ర ప్రారంభం

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ డంపింగ్ యార్డు సమస్యపై బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) మంగళవారం పాదయాత్ర చేపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన రాంచందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

గత 12 ఏళ్లుగా జవహార్ నగర్ డంపింగ్ యార్డు (Jawahar Nagar Dumping Yard)కు వ్యతిరేకంగా ఇక్కడి బాధితులు జేఏసీ ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డు వ్యర్థాల వల్ల ఏదులాబాద్ పెద్ద చెరువు కలుషితమై, మత్స్య సంపద పూర్తిగా నాశనమైందని అన్నారు. బాధితులు ఎంత మోర పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బాధితుల పక్షాన తాను పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు..

గతంలో డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా, నిబంధనలు పాటించాలని సుప్రీంకోర్టు రూ.లక్ష ఫైన్ వేసిందని ఈటల గుర్తు చేశారు. తన కంటే ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేశారని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎన్జీటీలో, సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందని అందరూ భావించారని.. కానీ రెండేళ్లయిన ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.

బీజేపీ ఎంపీగా తాను ఉన్నప్పుడు జవహర్ నగర్ డంప్ యార్డు గురించి పార్లమెంటులో ప్రశ్నించిన విషయాన్ని ఈటల రాజేందర్ (Eatala Rajender) గుర్తు చేశారు. రూ. 3,000 కోట్ల ఖర్చుపెట్టి జవహర్ నగర్ డంప్ సమస్యను పరిష్కరించాలన్నారు. చెరువును నమ్ముకుని బ్రతుకుతున్న మత్స్యకారులను ఆదుకోవాలని అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల నీళ్లు, పంట, పాడి, మత్స్య సంపద ఏదీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలని.. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

రాంచందర్ రావు ఆగ్రహం..

రాంచందర్ రావు మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యం వల్ల ఏదులాబాద్ చెరువు విషతుల్యంగా మారడమే కాకుండా, నగరమంతా దుర్వాసన వ్యాపించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ నాయకత్వంలో ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో, ఇక దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

Also Read : మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. కోతలు షురూ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>