Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి : కలెక్టర్ రిజ్వాన్ బాషా

కలం, జోగులాంబ గద్వాల : మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Collector Rizwan Basha Sheikh) అన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో, మోవో స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో బుధవారం గట్టు మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనం వద్ద మహిళా సంచార కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గట్టు మండలంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నాలుగు ఎలక్ట్రికల్ స్కూటీలు, ఒక ఆటో, సైకిల్ ను కొనుగోలు చేసి డ్రైవింగ్ లో కిశోర బాలికలు,మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

మహిళలు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహించి, సహకరించాలని కోరారు. మహిళా సమాఖ్య తరపున ఈ వాహనాలను అద్దెకు ఇచ్చి కూడా సభ్యులు ఆదాయం పొందవచ్చన్నారు. మహిళా సంఘాలు ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు, తదితర కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తెలంగాణ ఇంక్లూజివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రాంకు జిల్లాలో అత్యంత వెనుకబడ్డ గట్టు మండలంను ఎంపిక చేసినందున ఇక్కడి 14 గ్రామాల్లో 1033 కుటుంబాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయడమే కాక ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలను కూడా ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మోవో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు గట్టు మండలంలో వలసలు ఎక్కువగా ఉండేవని, ప్రజలు పేదరికంతో ఇబ్బంది పడే వారని, ప్రస్తుతం ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. మహిళల సాధికారత, స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గట్టు ప్రాంత మహిళల సంక్షేమం, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం మహిళా మొబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని, గట్టు మండలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే వాహనాలను ప్రారంభించి, ఆటోలో కాసేపు ప్రయాణించారు.

స్త్రీ శక్తి భవనాన్ని పరిశీలించిన కలెక్టర్..

అనంతరం జిల్లా కలెక్టర్ సమీపంలో అసంపూర్తిగా నిర్మించబడ్డ స్త్రీ శక్తి భవనాన్ని పరిశీలించారు. అలాగే పలువురు విద్యార్థులు చుట్టుపక్కల వివిధ ప్రభుత్వ విద్యాలయాల్లోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గట్టులోని జడ్పీహెచ్ఎస్ ను సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. వివిధ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గట్టు సర్పంచ్ నాగరాజు, మోవో స్వచ్ఛంద సేవా సంస్థ సీఈఓ జయ భారతి, తహసిల్దారు విజయ్ కుమార్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటేశ్వరి, ఏపీడీ శ్రీనివాస్,డిపిఎం సలోమి, శిక్షకురాలు నందిని, ఇతర అధికారులు, నేతలు, మహిళా సంఘాల సభ్యులు, కిశోర బాలికలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>