Mobile Popup Ad
Mobile Popup Ad

‘సర్’ ను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ కుష్బూ గుప్తా

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బూత్ లెవల్ సూపర్వైజర్లు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లు (ACLMTs), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROs), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs)లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని స్పష్టమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమని అన్నారు. నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా సవరించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి పౌరుని ఓటు హక్కును పరిరక్షించేందుకు ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

SIR ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అందువల్ల అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్ల ధృవీకరణ, మ్యాపింగ్ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పు నమోదులు, అనవసర తొలగింపులు జరగకుండా జాగ్రత్త పడాలని అన్నారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను ధృవీకరించిన తర్వాతే జాబితాలో మార్పులు చేయాలని ఆదేశించారు.

జిల్లా స్థాయిలో ERO లు, నియోజకవర్గ స్థాయిలో AEROలు, సమర్థవంతంగా పనిచేయాలని, EPIC డిప్యూటీ తహసీల్దార్లు కూడా అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. BLO సూపర్వైజర్లు, ACLMTలు శిక్షణలో అందించిన సూచనలు, మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని మండల స్థాయిలో BLOలకు నిర్వహించే శిక్షణలో SIR ప్రక్రియను సమగ్రంగా వివరించాలని ఆదేశించారు. ఎన్నికల విధులు సాధారణ ప్రభుత్వ పనులు కాదని, అత్యంత ప్రాధాన్యమైన బాధ్యతగా పరిగణించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

SIR విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విషయాన్ని ట్రైనర్లు BLOలకు కూడా స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. మండల స్థాయిలో AEROలు, నియోజకవర్గ స్థాయిలో EROలు తమ పరిధిలోని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి ఐదు రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించి, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ SIR పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కూడా EROలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత సాంకేతిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా తిరస్కరణలు (Rejections) అత్యంత జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే చేపట్టాలని చెప్పారు.

BLOలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కలిసి ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత పత్రాల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తమ గుర్తింపు పత్రాలను సమర్పించి ధృవీకరణ ప్రక్రియలో సహకరించాలని కోరారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, ద్వంద్వ నమోదులు కలిగిన వారి పేర్లను తొలగించి, కొత్తగా అర్హత సాధించిన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు వివరించారు.

SIR కార్యక్రమ షెడ్యూల్‌ను వివరాలు:

జూన్ 15 నుంచి 24 వరకు శిక్షణ, సన్నాహకాలు, ముద్రణ పనులు నిర్వహిస్తామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOల ఇంటింటి సర్వే జరుగుతుందని చెప్పారు. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, జూలై 31 నుంచి ఆగస్టు 13 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. వాటి పరిష్కార ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

శిక్షణ పొందిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లు తమ మండలాలకు వెళ్లి జూన్ 17 నుంచి 24 వరకు నిర్వహించే మండల స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో BLOలు, BLAలు, BLO సూపర్వైజర్లు, AEROలకు సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. SIR ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. SIR కార్యక్రమం కొనసాగుతున్నంత కాలం మండల తహసీల్దార్లు, AEROలు అందుబాటులో ఉండాలని, క్లిష్టమైన సమస్యలు లేదా సందేహాలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. ‘సర్’ అవగాహనకు సంబంధించి జూన్ 17న జిల్లాస్థాయిలో 2K రన్, జూన్ 18న అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో 2K రన్ నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హారి ప్రియా, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Read Also: దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>