కలం, నిర్మల్ : అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) అమలులో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి నిర్మల్ జిల్లా విశేష ప్రతిభ కనబరిచి ఎక్సలెన్స్ అవార్డును (Excellence Award) దక్కించుకుంది. ఈ పథకం కింద జిల్లాకు నిర్దేశించిన నమోదు లక్ష్యంలో 95 శాతం సాధించడంతో ఈ గుర్తింపు లభించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 56,145 మంది పథకంలో చేరారు. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పీఎఫ్‌ఆర్‌డీఏ సీజీఎం ఆశుతోష్ కుమార్ చేతుల మీదుగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ అవార్డును అందుకున్నారు.
సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ అవార్డును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎల్‌డీఎం రాంగోపాల్‌ను అభినందించారు. జిల్లాకు గుర్తింపు తీసుకురావడంలో కృషి చేసిన బ్యాంకు అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

