కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని సుజాతనగర్ మండలం పరిధిలో గల సీతంపేట గ్రామం(Seethampeta Village), జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో ఎంపిక చేయబడింది. 2023-24 సంవత్సరానికి పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో సీతంపేట గ్రామం ఎంపికయ్యింది. గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలలో సాధించిన పురోగతికి గుర్తింపుగా ఈ ఎంపిక జరిగిందని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ (Jitesh V Patil) సీతంపేట గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య చర్యలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతి ఇంటిలో నిర్మించిన మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, బహిరంగ విసర్జన చేయరాదు అని గ్రామస్థులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని, చెత్త వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రైనేజీలు ఎక్కడా మూసుకుపోకుండా తరచుగా శుభ్రపరచాలని, ఇంకుడు గుంతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో పురుషులు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో పచ్చదనం విస్తరించేందుకు విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో సీతంపేట గ్రామం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
గ్రామ లైబ్రరీలో 8,9,10వ తరగతి విద్యార్థులకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీల వెంట ఉన్న గుంటలను సరిచేయడానికి అవసరమైన రోలర్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జాతీయ స్థాయి పరిశీలన బృందం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో పచ్చదనం పరిరక్షణ, మౌలిక సదుపాయాల సంరక్షణలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ (Jitesh V Patil) పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసిల్దార్ కృష్ణ ప్రసాద్, శిక్షణ డిపిఓ అనూష, ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ శ్రీనివాస్, డిఎల్పిఓ ప్రభాకర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఫ్యామిలీ సూసైడ్స్ – పెరిగిపోతున్న విపరీత ధోరణి
Follow Us On: Sharechat

