కలం, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వం కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు కోసం అప్పులు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తీర్చే పనిలో పడింది. బీఆర్ఎస్ (BRS) హయాంలో 2020-23 మధ్య కాలంలో నాలుగేళ్లలో రూ. 25,803 కోట్ల మేర రుణాలను తిరిగి చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గడచిన రెండేండ్లలోనే రూ. 46,962 కోట్లను చెల్లించింది. మొత్తంగా ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పుల్లో రూ. 72,766.16 కోట్ల భారం తగ్గినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వానికి గడచిన రెండేళ్లలో ఆదాయం ఎక్కువగా పెరగకపోయినా పాత అప్పుల్ని తీర్చడంపై ఫోకస్ పెట్టింది. ఫలితంగా వడ్డీ భారం కూడా తగ్గేందుకు దోహదపడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులపై చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే పదేండ్ల తర్వాత కాంగ్రెస్‌కు అప్పుల రాష్ట్రాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు.
పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు :
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు (RBI) నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ పేరుతో ఎడాపెడా అప్పులు చేస్తున్నదని, రెండేండ్లలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేసిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ రెగ్యులర్‌గా కామెంట్ చేస్తున్నారు. కానీ రెండేండ్లలోనే కాళేశ్వరం (Kaleshwaram) అప్పుల్లో రూ. 46,962 కోట్ల మేర ‘అసలు’ (Principle)ను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చేసింది. దీనికి కారణం గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి ద్రవ్య సంస్థల నుంచి రుణాలను తీసుకోవడమే. ఆంధ్రాబ్యాంక్ (ఇప్పుడు యూనియన్ బ్యాంక్ గా మారింది.), పంజాబ్ నేషనల్ బ్యాంక్, నాబార్డ్ (NABARD), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) తదితర సంస్థల నుంచి గత ప్రభుత్వం సుమారు రూ. 84 వేల కోట్ల మేర రుణాన్ని తీసుకున్నది. ‘అసలు’ను తీర్చడం ద్వారా ప్రతి నెలా లేదా ప్రతీ త్రైమాసికానికి చెల్లించాల్సిన వడ్డీ భారం తగ్గుతుందన్నది ప్రస్తుత ప్రభుత్వ భావన.
ఒక్క నెలలోనే రూ. 417.34 కోట్ల వడ్డీ పేమెంట్ :
ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకుంటూనే మరోవైపు వడ్డీ భారాన్ని కూడా తగ్గించుకుంటున్నది రాష్ట్ర సర్కార్. ఒక్క నెలలోనే రూ. 417.34 కోట్ల మేర పాత అప్పులపై వడ్డీని చెల్లించింది. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం టాప్ ప్రయారిటీతో నిర్మించినా మూడు బ్యారేజీలు డ్యామేజ్ కావడంతో 2023 నుంచి సాగునీటి అవసరాలు తీరడంలేదు. ఆ ప్రాజెక్టు, మూడు బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నా పాత అప్పులను చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కొన్ని సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడినా పాత అప్పుల భారాన్ని తగ్గించుకోవాల్సి వస్తున్నది. రానున్న బడ్జెట్‌లో పాత అప్పులను తీర్చేందుకు ఎంత మొత్తంలో నిధులను కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరింది ఇలా : (కోట్ల రూ.లలో)
సంవత్సరం తీర్చిన అప్పు
2020 1,487.98
2021 3,364.65
2022 9,077.01
2023 11,873.70
2024 13,388.71
2025 33,574.11
======
జనవరి నెలలో కట్టిన వడ్డీ : (కోట్ల రూ.లలో)
పంజాబ్ బ్యాంక్‌కు 77.69
యూనియన్ బ్యాంక్‌కు 51.24
బరోడా బ్యాంక్‌కు 15.00
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 273.41
Read Also: ఆపరేషన్ కగార్ : దేశంలోనే చారిత్రాత్మక ఘట్టం.. మోదీ సంచలన ప్రకటన
Follow Us On: Youtube

