కలం, నిజామాబాద్ బ్యూరో : భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలనే సదాశయంతో స్వతంత్ర భారతదేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియను నిర్వహిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రీయ పద్ధతిలో పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. సెలవు దినం అయినప్పటికీ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం నవీపేట మండలం అనంతగిరి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ రాజాగౌడ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రీసర్వే పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల హద్దులను నిర్ధారించడం, భూ విస్తీర్ణాన్ని కొలవడం, రెవెన్యూ రికార్డులతో వివరాలను సరిపోల్చడం తదితర ప్రక్రియలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ప్రతి భూమికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భూ యజమానుల వివరాలు, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, హద్దులు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో వివరాలు నమోదు చేయాలని, ఒక్క అంగుళం స్థలం కూడా వదిలిపెట్టకుండా రీ సర్వే జరపాలని అధికారులకు సూచించారు.
భూ యజమానులకు ముందస్తు సమాచారం అందిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేయాలని, భూముల హద్దులు, విస్తీర్ణంపై వారికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. రీసర్వే పూర్తయిన అనంతరం భూ రికార్డులు మరింత కచ్చితత్వంతో అందుబాటులోకి వస్తాయని, భవిష్యత్లో భూ వివాదాలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని కలెక్టర్ సూచించారు.
రీ సర్వే జరిపిన మీదట భూ హద్దులు, సమగ్ర వివరాలతో కూడిన మ్యాప్ తో ఆధార్ తరహాలో భూధార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రీ సర్వే ప్రక్రియకు రైతులు, భూ యజమానులు సహకరించాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకటరమణ, స్థానిక సర్పంచ్ సుమలత, సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.

