కలం, మహబూబ్ నగర్ బ్యూరో: చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాల ప్రాధాన్యత, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, పిల్లల అభివృద్ధి దశలపై తల్లులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స అందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జాతీయ పోషణ మాసం (పోషణ్ మాహ్) కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్టేట్ హోమ్‌లో ‘మన అంగన్వాడీ – మన బాధ్యత’ అనే థీమ్ తో నిర్వహించిన ఆరోగ్యలక్ష్మి (సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం), అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలే ఇవ్వాలి..
శిశువు జన్మించినప్పటి నుంచి మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని కలెక్టర్ సూచించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. తల్లిపాలు తగినంతగా ఉత్పత్తి కావాలంటే బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. గర్భిణులు వైద్యుల సూచనల మేరకు ఐరన్, కాల్షియం మాత్రలను క్రమం తప్పకుండా తీసుకోవాలని, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు చిన్నారులకు అదనపు పోషకాహారం అందించాలని, రెండేళ్ల వయస్సు వరకు తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు. రెండేళ్లలోపు పిల్లలకు అధిక ఉప్పు, చక్కెర కలిగిన పదార్థాలు, ప్యాకెట్ ఆహారాలు, శీతల పానీయాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అరటిపండ్లు, చిరుధాన్యాలతో తయారు చేసిన జావ, పప్పులు, కూరగాయలు వంటి సహజసిద్ధమైన పోషకాహారం అందించాలని సూచించారు.
పిల్లలను చిప్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉంచాలి..
పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, పాఠశాలల్లో పిల్లలు చిప్స్, చాక్లెట్లు, శీతల పానీయాలకు అలవాటు పడుతున్నారని, వీటిని తరచూ తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం గుడ్లు, అన్నం, పప్పు, కూరగాయలు తదితర ఆహార పదార్థాలను నాణ్యతతో, తగిన పరిమాణంలో అందించాలని కార్యకర్తలకు సూచించారు.
పప్పులో బీరకాయ, పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు, కూరగాయలు కలిపి వండడం ద్వారా పోషక విలువలు పెరుగుతాయని తెలిపారు. పిల్లలు ఆహారం తినడం లేదనే కారణంతో దాని నాణ్యత, పోషక విలువల్లో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహార నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రీ ప్రైమరీ విద్య బాధ్యతలు విద్యాశాఖకు బదిలీ అయినప్పటికీ, చిన్నారులకు పోషకాహారం అందించే బాధ్యత మహిళా, శిశు సంక్షేమ శాఖపైనే కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరైన పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బంది చెప్పే విషయాలకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తారని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
చిన్నారుల్లో వయస్సుకు అనుగుణంగా శారీరక, మానసిక ఎదుగుదల జరుగుతోందా లేదా అన్నది తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు నిరంతరం గమనించాలని కలెక్టర్ సూచించారు. చిరునవ్వు, కంటిచూపుతో స్పందించడం, శబ్దాలకు ప్రతిస్పందించడం, మాటలు పలకడం, నిలబడటం, నడవడం వంటి అభివృద్ధి లక్షణాలను పరిశీలించాలన్నారు. నిర్ణీత వయస్సులో ఈ లక్షణాలు కనిపించకపోతే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు, ప్రత్యేక శిక్షణ ద్వారా ఎదుగుదల సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తూ చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కేంద్రాల్లో ఏవైనా సమస్యలు, లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో వాటిని పరిష్కరించాలని సూచించారు.
అనంతరం తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని గర్భిణులు, చిన్నారుల తల్లులకు పండ్లు, పూలు, గాజులు, చీరలను అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఇంటికీ సరైన పోషణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ పోషణ అభియాన్‌ను దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను కలెక్టర్ సందర్శించి, వివిధ రకాల పోషక విలువలున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

