కలం, నిజామాబాద్ బ్యూరో : మాక్లూర్ (Makloor) మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) శుక్రవారం సందర్శించారు. స్కూల్ ఆవరణను పరిశీలించిన ఆమె, ప్రహరీ లేకపోవడాన్ని గమనించి వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, స్కూల్ పరిసరాలలో పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు తుది దశలో కొనసాగుతున్న నేపథ్యంలో పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.
తరగతి గదులను సందర్శించిన కలెక్టర్, విద్యార్థినులతో మాట్లాడి వారి అభ్యాసన స్థాయిని అంచనా వేశారు. ఈ సందర్భంగా తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. నర్సింగ్ కోర్సు మంచి భవిష్యత్తు కలిగినదని, ఏకాగ్రతతో చదివితే మంచి అవకాశాలు లభిస్తాయని విద్యార్థినులకు ప్రోత్సాహం ఇచ్చారు. కరోనా సమయంలో పారా మెడికల్ సిబ్బంది అందించిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడిన ఆమె, సేవాభావంతో కూడిన నర్సింగ్ వృత్తిలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి, లక్ష్యసాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థినులు తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని, అధ్యాపకులకు మంచి పేరు తేవాలని చెప్పారు. వ్యక్తిగత భద్రత విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అనుకోని సంఘటనలు జరిగితే సఖీ సెంటర్‌ను సంప్రదిస్తే అన్ని విధాలుగా సహాయం అందిస్తారని, గోప్యతను కాపాడుతూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. బాలికల రక్షణ, ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, స్కూల్‌లోకి బాహ్య వ్యక్తులను అనుమతించకూడదని నిర్వాహకులకు స్పష్టం చేశారు. విధులలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

