Mobile Popup Ad
Mobile Popup Ad

​సారపాక 30 అడుగుల డొంక రోడ్డుకు మోక్షమెప్పుడు?.. బీజేపీ ప్రశ్న

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka) మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 30 అడుగుల పూర్వ డొంక రోడ్డు దుస్థితిని బీజేపీ నాయకులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మండల అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. సారపాక ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, స్థానిక జాతీయ రహదారి పై నిత్యం వాహనాల రద్దీ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యమని వారు పేర్కొన్నారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సారపాక గ్రామ పరిధిలోని రామభద్ర ఐటీఐ కాలేజీ వద్ద నుంచి గాంధీనగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో పూర్వం నుండి ఉన్న మట్టి రోడ్డును సరిచేసి శాశ్వత రహదారిగా నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, నిత్యం రాకపోకలు సాగించే కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో భాస్కర్ నగర్, గాంధీనగర్ ప్రాంతాల నుండి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పిల్లలకు ఈ మార్గం ఎంతో సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని గుర్తుచేశారు.

​ముఖ్యంగా వారపు సంత నిర్వహించే సమయంలో గాంధీనగర్ అమ్మవారి గుడి వీధిలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయాల్లో కనీసం అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఈ 30 అడుగుల పూర్వ డొంక రోడ్డును గనుక పునరుద్ధరించి నిర్మిస్తే, వాహన రాకపోకలు సులభతరమై అత్యవసర సేవలు సజావుగా సాగుతాయని వివరించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన సమస్యపై సంబంధిత అధికారులు, స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం త్వరితగతిన స్పందించి, రోడ్డు నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్, మండల ఇంచార్జ్ ముస్కు శ్రీనివాస్ రెడ్డి, దివ్యశ్రీ, మండల అధ్యక్షులు బీరక సాయిశ్రీను పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా నాయకులు, తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>