కలం, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంలో మీడియా ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మరింత విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. నాగర్కర్నూల్ కలెక్టరేట్లో సర్ ప్రక్రియపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో కొనసాగించడం సర్ ప్రక్రియ ఉద్దేశమని కలెక్టర్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు హక్కు కోల్పోకుండా చూస్తామన్నారు. ప్రజల్లో ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
సర్ ప్రక్రియలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, గుర్తించిన ఓటర్ల వివరాలు, నోటీసుల జారీ, బూత్ లెవల్ అధికారుల ద్వారా కొనసాగుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు ప్రభుత్వ, ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా, విస్తృతంగా చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ వంటి విస్తృత స్థాయిలో జరుగుతున్న ప్రక్రియపై ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాలు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో గతంలో 880 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 910 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో నెల రోజుల పాటు అధికారులు ఓటర్ జాబితా సవరణలకు సంబంధించిన దరఖాస్తులకు హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ఓటర్లు తమ పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాలను ఓటర్ జాబితాలో పరిశీలించుకోవాలని సూచించారు. వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సవరణలు, మార్పులు, చేర్పులు లేదా తొలగింపులకు సంబంధించి నిర్ణీత దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
ఈ పరిశీలనలో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని 13,216 మంది ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా ఓటర్లు సమర్పించిన ఎన్మరేషన్ ఫారాల్లో ప్రస్తుతం నమోదైన ఇంటి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, చిరునామా తదితర వివరాలను 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలతో సరిపోల్చి పరిశీలించినట్లు చెప్పారు. ఈ వివరాల విశ్లేషణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మరో 1,02,635 మంది ఓటర్లను గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు. రెండు విభాగాల్లో గుర్తించిన ఓటర్లను కలిపి జిల్లాలో మొత్తం 1,15,851 మంది ఓటర్లను గుర్తించినట్లు వెల్లడించారు.

