నిగ్వా గ్రామ నిర్వాసితులకు కలెక్టర్​ భరోసా..!

కలం, కుభీర్ : కుభీర్ మండలం నిగ్వా గ్రామంలో గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు వీలైనంత తొందరగా సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. మంగళవారం నిగ్వా గ్రామంలో గడ్డం వాగు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి.. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయిన విషయాన్ని గుర్తించి, అన్ని రికార్డులను సమగ్రంగా తనిఖీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని నిర్వాసితులకు కలెక్టర్​ హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితుల పునరావాసం కోసం కేటాయించాల్సి ఉన్న 26 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా సర్వే నంబర్ల భూములను పరిశీలించి, సాంకేతిక, రెవెన్యూ పరమైన చిక్కులను త్వరితగతిన పరిష్కరించి భూ పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్​ (Collector Bhavesh Mishra) ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పనులు ఆలస్యం కాకుండా నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు భూములు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల పరిశీలన పూర్తికాగానే తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టి బాధితుల ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. అనంతరం స్థానిక ఆలయంలో కలెక్టర్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీదేవి, గ్రామ సర్పంచ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>