కలం, యాదాద్రి భువనగిరి: ప్రతి కుటుంబంలో మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanthi) పిలుపునిచ్చారు. మహిళలు కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులుగా మాత్రమే కాకుండా.. స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి, ఆర్థికంగా ఎదిగే పారిశ్రామికవేత్తలుగా మారాలని ఆకాంక్షించారు. ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సంఘం (సంఘబంధం) సమావేశం, మహిళా సంఘాల సభ్యుల స్క్రీనింగ్ క్యాంపును కలెక్టర్ సందర్శించారు. మహిళా సంఘాల సభ్యులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.
మహిళల ఎదుగుదలకు పునాది..
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని కలెక్టర్ అనురాగ్ జయంతి వివరించారు. మహిళలు తమ అభిరుచులు, నైపుణ్యాలకు అనుగుణంగా టైలరింగ్, కిరాణా దుకాణాలు, కంప్యూటర్ కేంద్రాలు, డ్రోన్ సేవలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాల వంటి స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు, అర్హులైన మహిళలకు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు పొందేలా సంబంధిత శాఖల ద్వారా మార్గదర్శకత్వం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్ల తయారీ, క్యాంటీన్ల నిర్వహణ వంటి ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..
మహిళల ఆర్థిక అభివృద్ధితో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందరి వైద్య పరీక్షల నివేదికలు ఆలస్యమయ్యాయని, త్వరలోనే పూర్తి నివేదికలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళా సాధికారత అనేది కేవలం ఆర్థిక సహాయం అందించడంతోనే పూర్తికాదని.. నైపుణ్యం, ఉపాధి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం కలిసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆలేరు ఎంపీడీవో, ఎమ్మార్వో, సర్పంచి, మండల సమాఖ్య అధ్యక్షురాలు, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

