కలం, నాగార్జునసాగర్: తెలంగాణలో బీసీల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని, కేవలం రెడ్లు, వెలమలు మాత్రమే రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్నారని టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగించారు. రాష్ట్రంలో ఏకంగా 995 మంది దొరల అక్రమ ఆక్రమణలో కోటి ఎకరాల భూమి ఉందన్నారు.
1949 ఆగస్టు 15న నిజాం ఫర్మానా ద్వారా జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తీన్మార్ మల్లన్న వివరించారు. 1963లోనే కరీంనగర్ దొరలకు సుప్రీంకోర్టు “ఈ భూములు మీవి కావు” అని స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దొంగ కాగితాలు సృష్టించి 74 ఏళ్లుగా రెవెన్యూ శాఖను తమ గుప్పిట్లో ఉంచుకుని భూ రికార్డులను దాచిపెట్టారని ఆరోపించారు.
కోటి ఎకరాలను పంచుతాం..
టీఆర్పీ అధికారంలోకి రాగానే కోటి ఎకరాలను స్వాధీనం చేసుకుని బీసీలు, పేదలకు పంచుతామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మియాపూర్ పరిధిలో కేసీఆర్ కుటుంబం ఏకంగా 550 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. జాగీర్దారీ వ్యవస్థ అప్పుడే రద్దయిందని, ఆ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ కేసీఆర్ కుటుంబ కబ్జా యత్నానికి అడ్డుకట్ట వేసిందని గుర్తుచేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2,33,514 ఓట్లు ఉంటే, అందులో బీసీ ఓట్లే 1,48,000 ఉన్నాయని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. కేవలం 15 వేల ఓట్లు ఉన్న రెడ్ల తరఫున జానారెడ్డి, ఆయన కొడుకులు నాయకులుగా చెలామణి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం జీవో నెం.166 ద్వారా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే, జానారెడ్డి కోర్టులో కేసు వేయించి జీవోను రద్దు చేయించారని ఆరోపించారు.
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పిందని తీన్మార్ మల్లన్న విమర్శించారు. కేసీఆర్ బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గిస్తే, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక 19 శాతానికి కుదించారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో కులగణన చేసినప్పుడు బీసీలు 2 కోట్ల మంది ఉంటే, రేవంత్ రెడ్డి లెక్కల్లో అది 1.80 కోట్లకు తగ్గిపోయిందన్నారు. ఏకంగా 20 లక్షల మంది బీసీలను గాల్లో కలిపేశారని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో 10 లక్షలు ఉన్న రెడ్ల జనాభా రేవంత్ రెడ్డి లెక్కల్లో 15 లక్షలకు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని నిలదీశారు.
2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే..
ప్రభుత్వ ఆఫీసులు సమయానికి తెరవరు కానీ, వైన్ షాపులు మాత్రం ఉదయం 10 గంటలకే తెరుచుకుంటాయని తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు. 2 వేల పెద్ద వైన్ షాపులకు దేవతలు, బీసీ ఆడబిడ్డల పేర్లు పెట్టి ఆబ్కారీ శాఖ ద్వారా టార్గెట్లు పెట్టి మద్యం అమ్మిస్తూ.. కుటుంబాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.60 వేల కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. మిగిలిన రూ.58 వేల కోట్ల బీసీ నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 1,000 కిలోమీటర్ల పాదయాత్రలో కాళ్లు రక్తమోడుతున్నా ఆగేది లేదని, 2028లో బీసీల ప్రభుత్వాన్ని సాధించి తీరుతామని, కత్తెర గుర్తుపై ఓటేసి టీఆర్పీని గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

