కలం, మహబూబ్నగర్ బ్యూరో: రాబోయే రోజుల్లో ఎల్ నినో (El Nino) వల్ల తీవ్ర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, వచ్చే 8 నెలలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అధికారులకు సూచించారు. భవిష్యత్తులో కరువు పరిస్థితులు, నీటి కొరత, విద్యుత్ వంటి సమస్యలు ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధ్యక్షతన నిర్వహించిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎల్ నినో నేపథ్యంలో త్రాగు నీరు సరఫరా, విద్యుత్, వి.బి.జి రామ్ జీ పనులపై సమీక్షించారు.
జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో తాగునీటి సరఫరా, నీటి వనరుల లభ్యత, వేసవిలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడెక్కడ తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి, అక్కడ అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిశీలించి, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కూడిన కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాల మేరకు రాబోయే జూన్ నెల వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతోపాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలుత గుర్తించేది గ్రామస్థాయి సిబ్బందేనని పేర్కొంటూ, గ్రామస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీడీఓలు, మిషన్ భగీరథ, నీటిపారుదల, మున్సిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో నీటి వనరుల పరిస్థితిని పరిశీలించాలని, సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన చోట అదనపు నీటి వనరులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు, ఇతర అత్యవసర చర్యలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.
మహబూబ్ నగర్ నగర పాలక సంస్థతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ సూచించారు. ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, అవసరమైన నిధులు, అనుమతులు, ఇతర ప్రభుత్వ సహకారాన్ని సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, గ్రామాలవారీగా సమస్యలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రజా సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు ఇలాంటి సమీక్ష సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం అవసరమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల సరసరా బోరుబావులు వేయడం, మోటార్లు సమకూర్చడం, పైపులైన్లు ఏర్పాటు చేయడం వంటి పనులకు ముందస్తు ప్రణాళిక రూపొందించి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. నీటి సమస్యగానీ, విద్యుత్ సమస్యగానీ తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.
గ్రామాల్లో నీటి సంరక్షణ కోసం సోక్పిట్లు, సామూహిక సోక్పిట్లు, రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తూ పనులను పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రాబోయే రోజుల్లో నీటి, విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో రైతులకు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. అనుమతి లేకుండా చెరువుల్లో బోర్లు వేసినా, నీటిని వృథా చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

