కలం, ఖమ్మం బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ఇతర ముందస్తు చర్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పాల్వంచలో ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ సదుపాయాలను అధికారులు తనిఖీ చేశారు. ఆయా ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పర్యటన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
భద్రతా చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్వంచలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి తన భార్యతో కలిసి ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా రానున్నట్లు సమాచారం. ఈ పర్యటన ప్రశాంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
Also Read : హర్యానాలో గ్యాంగ్ వార్.. ధాబా వద్ద అసలేం జరిగింది?
Follow Us On : WhatsApp

