Mobile Popup Ad
Mobile Popup Ad

SIR పై అవగాహన కల్పించేందుకు వనపర్తి లో ‘2కే రన్’ నిర్వహణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: చనిపోయిన వ్యక్తుల పేర్లు, డబుల్ ఓట్లు వంటి వాటిని తొలగించడం ద్వారా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం వనపర్తి (Wanaparthy) లో 2కే రన్ నిర్వహించారు.

ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ రన్ నూతన బస్టాండ్ వరకు వెళ్లి తిరిగి ప్రారంభ ప్రదేశం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi), అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం రన్‌లో పాల్గొన్న వారిని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. SIR కార్యక్రమం ఓటర్ల పేర్లు తొలగించేందుకు కాదని, ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా రూపొందించేందుకు చేపడుతున్న ప్రక్రియ అని తెలిపారు.

జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఓటరుకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని, ఓటర్లు వాటిని పూర్తిగా నింపి తిరిగి సమర్పించడం ద్వారా తమ పేరు ఓటరు జాబితాలో కొనసాగుతున్నట్లు నిర్ధారించుకోవాలని సూచించారు. నిజమైన ఓటర్ల జాబితా తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, చనిపోయిన వ్యక్తుల పేర్లు, డబుల్ ఓట్లు వంటి వాటిని తొలగించడం ద్వారా ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించనున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2కే రన్‌లో యువత, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, సీపీఓ హరికృష్ణ, డీఎస్పీ గిరి ప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: తల్లులైనా ఆట ఆగొద్దు: ఐసీసీ కొత్త రూల్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>