Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్: జిల్లాలోని విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. వనపర్తి (Wanaparthy) పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో జరుగుతున్న నూతన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేయుటకు అందిన కొత్త పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను తనిఖీ చేసి, కొందరు విద్యార్థులకు స్వయంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

వనపర్తి బాలికల ఉన్నత పాఠశాలలో నూతన విద్యార్థుల ప్రవేశాలపై కలెక్టర్ ఆరా తీయగా, ప్రస్తుతం 702 మంది విద్యార్థులు ఉన్నారని, నిన్న పాఠశాల పునః ప్రారంభం కాగా ఇప్పటివరకు 65 మంది విద్యార్థులు కొత్తగా చేరారని తెలిపారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటుతుందని భావిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రవేశ సమయంలోనే అపార్ (APAAR) ఐడీలను రూపొందించాలని, యూ-డైస్ (U-DISE) పోర్టల్‌లో విద్యార్థుల వివరాలను సకాలంలో నమోదు చేసి నవీకరించాలని సూచించారు. పాఠశాలలకు అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు లేదా ఇతర మౌలిక వసతులు అవసరమైతే జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ద్వారా ప్రతిపాదనలు పంపించాలని, వాటికి అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే విద్యార్థుల డ్రాప్‌బాక్స్‌లో ఎలాంటి పెండింగ్ అంశాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో, ఇంచార్జ్ డిఇఓ యాదయ్య, ప్రిన్సిపల్స్ ఉమాదేవి, చంద్రశేఖర్, ఇతర విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>