కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా పిల్లలు అన్నాక అల్లరి పనులు చేస్తుంటారు, అబద్దాలు చెబుతుంటారు. వారు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను కూడా కొంత మంది తల్లిదండ్రులు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. అబద్ధం చెప్పినందుకు వారిపై అరవడం, శిక్షించడం వంటివి చేస్తుంటారు. అలా చేయడం కరెక్టేనా? అంటే ముమ్మాటికి కాదు. దానివల్ల వారు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పే అలవాటు నేర్చుకుంటారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక డౌట్ రావచ్చు.. అరవకుండా, శిక్షించకుండా పిల్లలు ఎలా మాట వింటారు, ఎలా మారతారు అని. కానీ వారిని సరైన పద్ధతిలో పెంచేందుకు నిపుణులు చెప్పే కొన్ని సలహాలు, సూచనలు (Parenting Tips) పాటిస్తే చాలట. అవేంటో తెలుసుకుందామా మరి.
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారు?
పిల్లలు అబద్దాలు చెప్పడం వెనుక చాలా కారణాలు ఉంటాయి. నేటి కాలంలో తల్లిదండ్రులు కెరీయర్ అంటూ తమ పనుల్లో తాము బిజీగా గడుపుతున్నారు. పిల్లలతో గడిపేందుకు సరైన సమయం కేటాయించులేకపోతున్నారు. దీనివల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించుకోవాలనే ఉద్దేశంతో అబద్ధాలు చెబుతుంటారంటున్నారు నిపుణులు.
ఒత్తిడి: పిల్లలు అబద్దం చెప్పడం వెనుక చాలా సందర్భాల్లో ఒత్తిడి కూడా ప్రధాన కారణమట.
భయం: పిల్లలు తప్పు చేసినప్పుడు లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు, శిక్ష పడుతుందనే భయంతో అబద్ధాలు చెబుతారని సూచిస్తున్నారు నిపుణులు.
తల్లిదండ్రులు చేయాల్సిన పనులు
పిల్లవాడు అబద్ధం చెప్పాడని తెలిసిన వెంటనే చాలా మంది తల్లిదండ్రులు వారిపై కోపపడటం, అరవడం లేదా శిక్షించడం చేస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం, ఇలా చేయడం వల్ల పిల్లలు నిజం చెప్పడం నేర్చుకోరట. బదులుగా, తల్లిదండ్రుల కోపం నుంచి తప్పించుకోవడానికి ఇంకా తెలివిగా అబద్ధం చెప్పడం నేర్చుకుంటారు. అందుకే పిల్లలు అబద్ధం చెప్పిన వెంటనే తల్లి దండ్రులు అరవకుండా పిల్లలను అర్థం చేసుకుని, ప్రేమగా మాట్లాడితే వారు క్రమంగా నిజం చెప్పే అలవాటు పెంచుకుంటారుట.
అంతే కాకుండా నువ్వు నిజం చెబితే నేను నిన్ను ఏమీ అనను, మనం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం అనే నమ్మకం పిల్లలలో కలిగించండి. పిల్లలు ధైర్యం చేసి నిజం చెప్పినప్పుడు, వారు చేసిన తప్పును పక్కన పెట్టి, నిజం చెప్పినందుకు ముందుగా వారిని మెచ్చుకోండి. నువ్వు నిజం చెప్పడం నాకు చాలా నచ్చింది, నువ్వు చాలా మంచివాడివి/మంచిదానివి అని చెప్పడం వల్ల వారికి నిజం చెప్పడంపై సానుకూల దృక్పథం పెరుగుతుందని సూచిస్తున్నారు.
మనుషులన్నాక తప్పులు చేయడం సహజం, కానీ వాటిని అబద్ధాలతో కప్పిపుచ్చకూడదు అని వారికి అర్థమయ్యేలా చెప్పండి. తప్పు జరిగినప్పుడు శిక్షించడం కంటే, ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో నేర్పించం ముఖ్యం అంటున్నారు నిపుణులు.

