కొనుగోళ్లు సరే.. సీఎంఆర్ మాటేమిటి?

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ (Nalgonda)జిల్లా వరి పంట సాగులో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉంటుంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో దాదాపు 13.72 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుంది. ఈ దిగుబడులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు (Grain Procurement) కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం రెడీ అయ్యింది. కోతలకు రెండు నెలల ముందుగానే కొనుగోళ్లకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఏటా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం.. వాటిని సీఎంఆర్ కింద రైసు మిల్లులకు కేటాయించడం.. మిల్లుల యాజమాన్యాలు ఏండ్లు గడుస్తున్నా.. నేటికీ సీఎంఆర్ (CMR) తిరిగి ఇవ్వకపోవడం షరా మాములుగా మారింది. అప్పన్నంగా రూ.వందల కోట్ల సీఎంఆర్ రైస్ స్వాహా అవుతున్నా.. తిలా పాపం.. తలా పిడికెడు అన్న చందంగా అధికారులు రికవరీ చేయడంలో విఫలమవుతున్నట్టు నటిస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారులు సైతం ఆ దిశగా ఆలోచించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

సీఎంఆర్ కేటాయింపులతో భారీ నష్టం..

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో దాదాపు 550కి పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 230 రైస్ మిల్లులు ఉండగా, సూర్యాపేటలో 180, యాదాద్రిభువనగిరి జిల్లాలో 100 వరకు రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే అన్ని రైసు మిల్లులకు సీఎంఆర్ కేటాయించే పరిస్థితి ఉండదు. 70 శాతం మిల్లులకు ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా సీఎంఆర్ అలాట్ అవుతూ వస్తోంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సగటున 18 నుండి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు సీఎంఆర్ కింద అధికారులు కేటాయిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద అలాట్ అవుతుండగా, సూర్యాపేట జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నులు, యాదాద్రి భువనగిరిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ రూపంలో మిల్లులకు చేరుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లులకు ఇచ్చిన ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఎఫ్‌సిఐ, సివిల్ సప్లైస్ గోదాములకు అప్పగించాలి. కానీ సకాలంలో మిల్లుల నుంచి తిరిగి వస్తుంది కేవలం 50 నుంచి 60 శాతమే. ఆ తర్వాత రెండు మూడేండ్ల వ్యవధిలో మరో 30 నుంచి 40 శాతం వస్తుంది. ఇక మిగిలినంత బకాయిల రూపంలో పెండింగ్‌లో ఉంటోంది. ఇలా పెండింగ్ వల్ల ఒక్క 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు రూ.400 కోట్ల విలువైన బియ్యం మిల్లర్లే వద్ద ఉండిపోవడం గమనార్హం.

మిల్లర్లపై అధికారుల కారుణ్యం..

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో సీఎంఆర్ పెండింగ్ లేని మిల్లులు కేవలం 10 శాతానికి లోపే ఉంటాయి. 90 శాతం మిల్లులు ఏదో ఒక రూపంలో సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉంటూ వస్తోంది. అయితే అలాంటి మిల్లులపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం కనికరం చూపుతోంది. నిజానికి మిల్లర్ల నుంచి నిర్దేశిత గడువులోపు సీఎంఆర్ ఇవ్వకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రతి ఏటా అలాట్ చేసిన సీఎంఆర్‌లో సగం ఇవ్వడం.. మిగతాది పక్కదారి పట్టించడం మిల్లర్లకు అలవాటుగా మారిపోయింది. అధికారులు సైతం అమ్యామ్యాలు పుచ్చుకుని మా ఇంటికి నష్టం రాట్లేదుగా.. జనం సొమ్మేగా పోయేది అనే తరహాలో చూసీచూడనట్టు వదిలేయడం మిల్లర్లకు కలిసొస్తుంది. అయితే అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎంఆర్ పెండింగ్‌ భారీగా ఉన్న మిల్లులను గతంలో డిఫాల్టర్ల జాబితాలో చేర్చాయి. అయితే మిల్లర్లు తెలివిగా అదే మిల్లుకు పేరు మార్చి.. అధికారులు మేనేజ్ చేసి మళ్లీ సీఎంఆర్ అలాట్ చేయించుకున్న ఘటనలు సూర్యాపేట జిల్లాలో కొకొల్లలు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలు లెక్కలేనన్నీ వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ సర్కారు హయాంలోనూ అదే పరిస్థితి కన్పిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లు ఏర్పాట్లు ఏలా చేస్తుందో.. అదే స్థాయిలో సీఎంఆర్ రికవరీ చేయాల్సిన అవసరం ఉంది.

Read Also: నిజామాబాద్‌లో గ్లకోమా అవగాహన ర్యాలీ

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>