కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరులో విమానాశ్రయం కలగానే మారింది. జక్రాన్‌పల్లిలో గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్ట్ (Jakranpally Airport) కు గ్రీన్ సిగ్నల్ లేక దశాబ్దాలుగా విమానం ఎగరడం లేదు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలత ఉందని అధికారికంగా పేర్కొన్నప్పటికీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.
జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భౌగోళికంగా ఎలాంటి అభ్యంతరాలు లేవని ‘టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ’ వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి గతంలోనే ప్రతిపాదనలకు అనుమతులు లభించాయి. తాజాగా వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లకు గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి. దీంతో నిజామాబాద్ వాసుల్లో ఆందోళన నెలకొంది. అన్ని అర్హతలు ఉండి, సర్వేలు పూర్తయినా నిజామాబాద్ పేరు ప్రతిపాదనలో కనిపించకపోవడం ఉమ్మడి జిల్లా వాసులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఏదీ
జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి గతంలోనే క్షేత్రస్థాయిలో సర్వేలు జరిగాయి. సాంకేతిక, భౌగోళిక వివరాలు నమోదు చేశారు. తొర్లికొండ, కొలిప్యాక, అర్గుల్, మనోహరాబాద్, జక్రాన్‌పల్లిలో 1,668 ఎకరాలు గుర్తించి ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. నాగపూర్ నేషనల్ హైవే 44కు అత్యంత సమీపంలో ఉండటంతో అనుసంధానం చాలా సులభం అవుతుంది. నిజామాబాద్ సిటీతో పాటు నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల కేంద్ర బిందువుగాను ఉంది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి రన్‌వే నిర్మాణం, ఏప్రెన్, టెర్మినల్ బిల్డింగ్‌ల ఏర్పాటుకు భౌగోళికంగా ఎలాంటి అడ్డంకులు లేవని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలమని ఏఏఐ కూడా స్పష్టత ఇచ్చింది.
బీజేపీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ఉన్నా..
నిజామాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్ట్ సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మేధావులు, ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికార కాంగ్రెస్ కు సైతం మెజారిటీ ఎమ్మెల్యేల బలం ఉంది. జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇంతటి బలమైన రాజకీయ ప్రాతినిథ్యముంది. వీరు జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ ఫైల్‌ను సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొంటున్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ కేంద్రంతోనూ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. రాష్ట్రప్రభుత్వంతోనూ చర్చించి సమన్వయం చేసుకొని ఇప్పించగలిగితే ముందడుగు పడే అవకాశాలున్నాయి.
గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం
గల్ఫ్ దేశాలకు దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్కు వలస వెళ్లే కార్మికుల్లో అత్యధిక శాతం మంది ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. యూరప్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడ్డ, ఉన్నత చదువులు అభ్యసిస్తున్నవారు లేకపోలేదు. వేలాది మంది గల్ఫ్ కార్మికులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాల్సి వస్తోంది. లేదంటే ముంబై, ఢిల్లీ మీదుగా వెళ్తుంటారు. గంటల కొద్దీ ప్రయాణాలు, రవాణా ఖర్చులు అవుతున్నాయి.
అదే జక్రాన్ పల్లిలో ఎయిర్ పోర్ట్ వస్తే.. సమయం, ఖర్చులు కలిసివస్తాయి. అత్యవసర సమయాల్లో కార్మికులు కుటుంబాల వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లా ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ నుంచి వచ్చే విదేశీ ద్రవ్యానికి కీలక పాత్ర. ఇక్కడే ఎయిర్‌పోర్ట్ ఉంటే భవిష్యత్తులో అంతర్జాతీయ సర్వీసులు, కనెక్టింగ్ సర్వీసులు పెరిగి, గల్ఫ్ కార్మికుల ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
పారిశ్రామిక వృద్ధికి ఊతం
ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ఊతం ఇస్తుంది. పసుపు, వరి పంటలకు రవాణా సౌకర్యాలు మెరుగై, ఇక్కడి ఉత్పత్తులను నేరుగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ అనుబంధ పరిశ్రమలు, హోటళ్లు, రవాణా రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు వేలాది ఉద్యోగ, ఉపాధి కల్పన జరుగుతుంది.

